కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరారై పొట్రు' చిత్రం ఆస్కార్ రేసులో నిలిచిందని సమాచారం. ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో పలు విభాగాల్లో నామినేట్ అయ్యినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ కారణంగా గతేడాది అక్టోబరులో నేరుగా ఓటీటీల్లో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే అకాడమీ అవార్డులను కేవలం థియేటర్లలో విడుదలైన చిత్రాలనే పరిశీలిస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా సంక్షోభం కారణంగా డిజిటల్ వేదికల్లోనూ విడుదలైన చిత్రాలను ఆస్కార్ పోటీకీ అర్హులుగా పరిగణించారు.
అకాడమీలో స్వల్ప మార్పులు
కరోనా కారణంగా ఈ ఏడాది ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో నిర్వాహకులు అనేక మార్పులు చేశారు. నేరుగా ఓటీటీల్లో విడుదలైన సినిమానూ ఆస్కార్ పోటీలో నిలిచేందుకు అవకాశాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో హీరో సూర్య నటించిన 'సూరారై పొట్రు' చిత్రం ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కథా రచయిత వంటి విభాగాల్లో ఈ చిత్రం పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది. అకాడమీ స్క్రీనింగ్ రూమ్‌లో మంగళవారం ఈ చిత్రాన్ని ప్రదర్శించారని సమాచారం. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సిఉంది.
థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా విడుదలైన తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. కెప్టెన్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా రూపొందిన 'సూరారై పొట్రు' చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించగా.. గుణీత్ మోంగాతో కలిసి హీరో సూర్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సూర్య సరసన అపర్ణా బాలమురళి హీరోయిన్గా నటించారు.
ఇదీ చూడండి: 'ఉప్పెన' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?