దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుధిరం). గత నెల 27న హీరో రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ చెప్పడం సహా, ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో చరణ్ లుక్, మరో కథానాయకుడు జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో వార్త ఆసక్తి కలిగిస్తోంది.
ఈ కథలో కీలకమైన కొమరం భీమ్ బాబాయ్ పాత్ర కోసం మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే ఖరారైతే తారక్-మోహన్‌లాల్ కలిసి నటించే రెండో చిత్రమిది అవుతుంది. గతంలో 'జనతా గ్యారేజ్' కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారు.
'ఆర్ఆర్ఆర్'లో హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్.. కీలక పాత్రల్లో రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: 'వాయిదా లేదు.. అనుకున్న సమయానికే వస్తాం'