సామాజిక దూరం... వ్యక్తిగత శుభ్రత పాటించడమే కాకుండా, భయాందోళనలకు గురి కాకుండా ఉండటం ముఖ్యమని అన్నాడు ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అతడు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించాడు. కొన్ని కీలకమైన సందేశాలు ఇచ్చాడు.
"రెండు వారాలుగా లాక్‌డౌన్ విజయవంతంగా కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా మన ప్రభుత్వాలు కలిసి చేస్తున్న ప్రయత్నాల్ని అభినందిస్తున్నా. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున మనమంతా ఆరోగ్యంతో ఉన్నామని నిర్ధారించుకుని, కోవిడ్ 19కి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆరోగ్య సంక్షోభ సమయంలో మన జీవితాల కోసం వీధులు, ఆస్పత్రుల్లో ఉంటూ ధైర్యంగా పోరాటం చేస్తున్న యోధులందరినీ గౌరవిద్దాం, ప్రశంసిద్దాం. మరో ముఖ్యమైన విషయంపై కూడా దృష్టిపెట్టాలి. భయాందోళనకి దూరంగా ఉండటం. భయాన్ని సృష్టించే వ్యక్తుల నుంచి, సమాచారం నుంచి మనల్ని మనం దూరం ఉంచుకోవడం కీలకం. తప్పు దారి పట్టించే సమాచారానికి దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరూ ప్రేమనీ, ఆశనీ, తాదాత్మ్యం వ్యాప్తి చేయాలని కోరుతున్నా"
- మహేష్‌బాబు, కథానాయకుడు.