సూపర్‌స్టార్ కృష్ణ.. తన కెరీర్లో ఎన్నో అద్భుత చిత్రాలు, వినూత్న కథలు, విభిన్న పాత్రలతో మెప్పించారు. అయితే ఆయన సినిమాల్లోనే కాకుండా షూటింగ్‌ల్లోనూ పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. నేడు (మే 31) కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఓ గమ్మత్తైన సంఘటన మీకోసం.
'అల్లూరి సీతారామరాజు'(1974) తర్వాత కృష్ణ చేసిన 14 చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయాయి. సరిగ్గా ఆ సమయంలో ఆయన చేసిన చిత్రం 'పాడిపంటలు'. అత్యధిక భాగం అవుట్‌డోర్‌లో నిర్మించిన గ్రామీణ కుటుంబ కథాచిత్రం కూడా ఇదే కావడం విశేషం.
"తానే నిర్మాత అయినప్పటికీ కృష్ణ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ఒక ఊరి నుంచి మరో ఊరికి ధాన్యం బస్తాలు ఎడ్ల బండ్ల మీద మోసుకెళ్లే సీన్ తీస్తున్నాం. నేను ఎక్కువ ఎడ్లబండ్లు కావాలని అడిగితే తక్కువ బండ్లు తీసుకొచ్చారు. ఈ విషయంలో నా అసంతృప్తిని గమనించిన కృష్ణ.. షూటింగ్ క్యాన్సిల్ చేయించి, తర్వాత రోజు ఎక్కువ ఎడ్లు బండ్లు తీసుకొచ్చారు" అని దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి గతంలో వెల్లడించారు.