పూర్వాశ్రమంలో... అంటే 1969 ప్రాంతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ బెంగుళూరు శ్రీనగర్-మెజేస్టిక్ రూట్ సిటీ బస్సులో కండక్టర్. ఆ బస్ రూటుకు డ్రైవర్ రాజబహదూర్. ఇద్దరి మధ్య స్నేహబంధం రెక్కలు తొడిగింది. రాజబహదూర్ ప్రోత్సాహంతో రజనీకాంత్ తలైవాబి.టి.ఎస్ (బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) నాటకరంగ కళాకారుల బృందంలో చేరి పౌరాణిక నాటకాల్లో కర్ణుడు, దుర్యోధనుడు వంటి మంచి పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నాడు. రజనీ నటనలో వున్న ప్రత్యేకమైన శైలిని చూసి రాజబహదూర్ సినిమాలలో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు.
ఉద్యోగానికి గుడ్ బై చెప్పడానికి ఇష్టపడని రజనీకాంత్‌ని రాజబహదూర్ ఒప్పించాడు. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే తనకున్న పాల డెయిరీలో పనిచేయవచ్చని ధైర్యం నూరిపోశాడు. రజనీ యాక్టింగ్ స్కూల్‌లో చేరాడు. నెలకు రెండు వందలు రాజబహదూర్ రజనీకి మనియార్డర్ చేసేవాడు. ఎప్పుడైనా డబ్బులు పంపలేకపోతే ఉపయోగపడేందుకు తన బంగారు గొలుసు రజనీ చేతిలో పెట్టాడు. రజనీ దశ తిరిగి బాలచందర్ చేతిలో పడ్డాడు. ‘అపూర్వ రాగంగళ్’, ‘మూన్రాం ముడిచ్చు’ వంటి ప్రయోగాత్మక సినిమాలతో స్టార్డమ్ అందుకున్నాడు.
ఎంత ఎదిగినా తనను ప్రోత్సహించి, డబ్బు పంపి ఆదుకున్న రాజబహదూర్‌ని మాత్రం మరవలేదు. తరచూ బెంగుళూరు వెళతాడు. రాజబహదూర్‌తో కలిసి విద్యార్థి భవన్‌లో నేతి దోశలు కట్టించుకొని ఎంచక్కా కృష్ణారావు పార్కులో కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇద్దరూ ఎం.జి.రోడ్డు, బ్రిగేడ్ రోడ్లవెంట పబ్లిక్‌గా తిరుగుతారు. ఎక్కడంటే అక్కడ కూర్చొని కబుర్లాడుకుంటూ, జోకులు పేల్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే అంతపెద్ద సూపర్ స్టార్ అంత పబ్లిక్‌గా తిరగడం ఎలా సాధ్యం అనే ప్రశ్న మనకు తలపించక మానదు.
కానీ రజనీ సాధ్యం చేసి చూపాడు. బెంగుళూరు నడిబొడ్డున రజనీకి ఫ్లాట్ వుంది. ఆ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరవై యేళ్ళ వృద్ధుడులాగానో లేక ఎనభై యేళ్ళ వృద్ధుడిలాగానో తన వేషం మార్చుకుంటాడు. తరువాత రాజబహదూర్ వచ్చి కలుస్తాడు. ఇద్దరూ కలిసి రజనీ మొదట్లో వున్న అద్దె ఇంటివైపు వెళ్తారు. గుట్టళ్లి ప్రాంతంలో ఒక బజ్జీకొట్టులో వేడివేడి బజ్జీలు, బోండాలు కొంటారు. వాటిని పార్సిల్ కట్టించుకొని ఉమా థియేటర్ దగ్గరలోవున్న మెట్లమీద కూర్చుంటారు. వచ్చేపోయే వారిని చూస్తూ వాటిని ఆరగిస్తారు. తరువాత ఆ పక్కనే వుండే టీ పాకలో స్ట్రాంగ్ కాఫీ తాగుతారు. మళ్ళీ నడక సాగించి బళేపేట రామన్న హోటల్‌లో బిరియాని పొట్లం కట్టించుకొని గంగాధర పార్కులో కూర్చొని ఆ బిరియానీ లాగిస్తారు.
ఒకసారి అలా వెళుతూ వుంటే ఒక వృద్ధురాలు కట్టెలమోపు నెత్తికి ఎత్తుకోలేక అవస్థ పడుతూ వుండడం రజనీ గమనించాడు. వెంటనే వెళ్లి ఆ మోపును ఆ వృద్ధురాలి నెత్తిమీదకు చేర్చాడు. ఆమెవెంట కొంచెం దూరం నడిచి ఎవరూ గమనించడం లేదని రూఢి పరచుకున్న తరువాత జేబులోనుంచి చేతికి వచ్చినంత డబ్బులు తీసి ఆమె చీర కొంగుకు కట్టాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇంటికి వెళ్లిన తరువాత కొంగుముడి విప్పమని చెప్పి రాజబహదూర్‌తో అదృశ్యమయ్యాడు. ఆ కొంగుముడిలో రజనీ వదలిన డబ్బుతో ఆమె ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. అది అంత పెద్ద మొత్తం!
అలా ఒకరికి కాదు తోపుడు బండిని తోయలేక అవస్థపడుతున్న వృద్ధుడికి, చిత్తు కాగితాలు ఏరుకునే నిరుద్యోగికి, నిస్సహాయ స్థితిలో వున్న వృద్ధురాలికి అలా డబ్బు ఇచ్చుకుంటూ పోతున్న రజనీని చూసి రాజబహదూర్ కళ్లలో నీళ్ళు తిరుగుతుంటాయి. రాజబహదూర్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొని అతని భార్యా బిడ్డలకు డబ్బు, బహుమతులు పంచి, రాజబహదూర్ తోడురాగా ఒక ఆటోలో తన ఫ్లాట్‌కు చేరుకుంటున్న రజనీకాంత్‌ని చూసి రాజబహదూర్... ‘ఓహో రజనీ బెంగుళూరు వచ్చి రోడ్లవెంట, పార్కుల వెంట నాతో తిరిగేది ఇందుకనా’ అనుకోవడం పసిగట్టిన రజనీ ‘‘అవును మిత్రమా... నువ్వు నేర్పిన విద్యేగా’’ అని నవ్వుతూ లిఫ్ట్‌లోకి వెళ్తాడు స్నేహితుడికి గుడ్ బై చెబుతూ ... ఎంత ఎత్తుకెదిగినా రజనీకాంత్ మాత్రం ఇసుమంత కూడా మారలేదు. అదే శివాజీరావ్ గైక్వాయడ్... అదే... ఆ సూపర్ స్టార్... నిరాడంబరత! ఔదార్యం!!
- ఆచారం షణ్ముఖాచారి