తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న చరిత ఆయన సొంతం. ఇప్పుడాయన సినీ ప్రయాణాన్ని 'జై విఠలాచార్య' పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొస్తున్నారు రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ. 'మూవీ వాల్యూమ్' షేక్ జిలాన్ భాషా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. ఈ పుస్తక ఫస్ట్‌లుక్‌ను నటుడు సూపర్‌స్టార్ కృష్ణ తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "విఠలాచార్య దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు. ఆయన దర్శకత్వంలో నేనొక సినిమా చేశా. అది 'ఇద్దరు మొనగాళ్లు'. మంచి విజయాన్ని అందుకొంది. ఆయన అప్పట్లో చాలా వేగంగా, అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాలు తీసేవారు. ఒక దర్బార్ సెట్ వేస్తే.. అందులో ఒకవైపు బెడ్‌రూమ్, మరోవైపు కారిడార్ సెట్స్ వేసేవారు. ఆయనెప్పుడైనా ఖాళీగా ఉంటే వాహినీ స్టూడియోస్‌కు వచ్చే వారు. నా షూటింగ్‌లు ఎక్కువ అక్కడే జరిగేవి. మా సెట్‌కు వచ్చి కూర్చొని, నాతో సరదాగా కబుర్లు చెప్పేవారు. విఠాలాచార్యపై ఇప్పుడు పుస్తకం వస్తుండటం సంతోషంగా ఉంద’’న్నారు.
"సినిమా నిర్మాణంలో విఠలాచార్య పెద్ద బాలశిక్ష లాంటి వారు. ఆయన శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేశాం. వేగంగా పుస్తకాన్ని పూర్తి చేశామ"న్నారు పులగం చిన్నారాయణ.
ఇవీ చదవండి: