బహుముఖ ప్రజ్ఞాశాలి టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ. నటుడిగా తొలి చిత్రం 'తేనె మనసులు'తోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తంగా కెరీర్లో 350కిపైగా సినిమాలు చేశారు. అప్పట్లోనే టాలీవుడ్‌కు ఎన్నో టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కింది.
1970లో కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావుతో కలిసి పద్మాలయ స్టూడియోస్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్లో తొలి చిత్రం 'అగ్ని పరీక్ష' రూపొందించగా.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్బాస్టర్ని అందుకున్నాయి. అయితే తాజాగా శుక్రవారానికి ఈ స్టూడియో స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పద్మాలయ విశిష్టత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
కొత్త ప్రయోగం
'అగ్ని పరీక్ష'తో హిట్ అందుకున్నాక.. ఈ సారి కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నారు కృష్ణ. హాలీవుడ్ సినిమాలు 'మెకనాస్ గోల్డ్', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తదితర చిత్రాల స్ఫూర్తితో కౌబాయ్ కథను తయారు చేసి కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 'మోసగాళ్లకు మోసగాడు' అనే అద్భుత చిత్రాన్ని రూపొందించారు. రొటీన్ ప్రేమ కథలు, కుటుంబ గాథలు వస్తున్న రోజుల్లో.. ఈ సినిమా సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇందులో కౌబాయ్‌గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు సూపర్‌స్టార్. అప్పటి వరకు స్టూడియోస్ వరకే పరిమితమైన చిత్ర నిర్మాణాన్ని అవుట్‌డోర్‌కు తీసుకెళ్లింది ఈ చిత్రమే. రాజస్థాన్ ఎడారి, ప్రకృతి అందాలకు నిలయమైన ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు.
అనంతరం 'పండంటి కాపురం', 'అల్లూరి సీతారామ రాజు', 'దేవుడు చేసిన మనుషులు' వంటి ఎన్నో మరపురాని సినిమాలు ఈ బ్యానర్లో వచ్చినవే. ఈ చిత్రాల ద్వారా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు కృష్ణ. ఇక విజయ నిర్మల దర్శకత్వంలో 1974లో విడుదలైన తెలుగు చిత్రం 'దేవదాసు'. ఇందులో కృష్ణ నటన, ఆరుద్ర సంభాషణలు, గీతాలు... చిత్రానికి విలువను తెచ్చిపెట్టాయి.
ఫ్లాప్‌ల నుంచి మళ్లీ విజయతీరాలకు
వరుస హిట్ సినిమాలతో జోరుమీదున్న కృష్ణకు అనూహ్యరీతిలో ఫ్లాప్‌లు మొదలయ్యాయి. అలా మెల్లగా కెరీర్ డౌన్ అయిపోతున్న సమయంలో తన సొంత నిర్మాణ సంస్థలో 'పాడిపంటలు' అనే సినిమా తీసి 1976 సంక్రాంతికి విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. సాధారణంగా సంక్రాంతి అంటే ఎన్టీఆర్, నాగేశ్వరరావు చిత్రాలు పోటీ పడుతుంటాయి. మిగతా హీరోలు ఈ పండగ బరిలో దిగడానికి సాహసించరు. కానీ కృష్ణ.. వారి సినిమాలకు దీటుగా 'పాడిపంటలు' విడుదల చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత 1997 సంక్రాంతికి తన అభిమాన నటుడు ఎన్టీఆర్ నటించిన 'దానవీర శూరకర్ణ' సినిమాకు పోటీగా 'కురుక్షేత్రం'తో మరోసారి తలపడ్డారు కృష్ణ. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈసారి బాక్సాఫీసు యుద్ధంలో ఎన్టీఆర్ సినిమా విజయం సాధించినప్పటికీ.. కృష్ణ సినిమా సాంకేతికంగా మాత్రమే పేరు, ప్రఖ్యాతలు గాంచింది. హిందీతో పాటు తమిళ, కన్నడంలోనూ చిత్రాలు నిర్మించి విజయం సాధించారు
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినీ ప్రపంచంలోనే ఓ సాహసం
సూపర్‌స్టార్ కృష్ణ సినీ ప్రపంచంలో ఓ సాహసం అనే అనాలి. వెండితెరకు అరంగేట్రం చేసిన తొమ్మిదేళ్ల వ్యవధిలోనే 'అల్లూరి సీతారామరాజు'తో 100 సినిమాలు పూర్తి చేసుకున్న ఘనతను దక్కించుకున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ.. 1980లో డబుల్ సెంచరీ చిత్రం 'ఈనాడు'ను విడుదల చేశారు. ఇది కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సాంకేతికతకు పెద్దపీట
ఇక సాంకేతికతకు పెద్దపీట వేసే కృష్ణ.. తెలుగులో తొలి 70 ఎమ్ఎమ్ చిత్రం 'సింహాసనం' రూపొందించారు. సొంత బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి.. తొలిసారిగా ఆయనే దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఇది కూడా కాసుల వర్షాన్ని కురిపించింది.
బాలీవుడ్‌లోనూ
పద్మాలయ బ్యానర్ తెలుగులోనే కాదు హిందీలోనూ సంచలనాలు సృష్టించింది. 1980లో 'టక్కరి' సినిమాతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టిన పద్మాలయ.. 'హిమ్మత్ వాలా'తో ప్రభంజనం సృష్టించింది. కృష్ణ తెలుగులో నటించిన 'ఊరికి మొనగాడు' సినిమాకు ఇది రీమేక్. ఈ మూవీతోనే బాలీవుడ్లో శ్రీదేవి స్టార్డమ్ అందుకుంది. ఆ తర్వాత జితేంద్ర హీరోగా 'పాతాళభైరవి' వెంకటేశ్ నటించిన 'సూర్యవంశం' హిందీ రీమేక్ కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. అనంతరం తమిళ, కన్నడ భాషల్లోనూ తన బ్యానర్‌పై ఎన్నో సినిమాలు నిర్మించారు కృష్ణ.
ఇది చూడండి : బాలకృష్ణ సరసన ఉత్తరాది కొత్త భామ!