చిత్రం: కలర్ ఫోటో
సంస్థ: అమృత ప్రొడక్షన్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
విడుదల: 23 అక్టోబర్ 2020 ('ఆహా'లో)
దసరా అనగానే బాక్సాఫీసు కళకళలాడేది. సెలవుల్లో అగ్ర కథానాయకుల చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యేవి. కానీ కరోనా ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కొత్త సినిమా కోసం ఓటీటీలవైపు చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 'ఆహా' ఓటీటీలో ఈ వారం విడుదలైన కొత్త సినిమా 'కలర్ ఫోటో'. హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే చేరువైన సుహాస్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే?
1997లో మచిలీపట్నం దగ్గర ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరిలోనే పాలమ్ముకుంటూ కష్టపడి ఇంజినీరింగ్ చదువుతుంటాడు జయకృష్ణ (సుహాస్). బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి.. తన తండ్రిని బాగా చూసుకోవాలనే లక్ష్యంతో జీవిస్తుంటాడు. ఓ రోజు కాలేజీలో కల్చరల్ రిహార్సల్స్‌లో అమ్మవారి వేషంలో ఉన్న దీప్తి వర్మ (చాందినీ చౌదరి)ను చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. కానీ, అంత అందమైన అమ్మాయి తన లాంటి నల్లగున్న అబ్బాయిని ప్రేమిస్తుందో లేదో అన్న భయంతో ప్రేమను మనసులోనే దాచుకుంటాడు. ఆమెను దూరం నుంచి చూస్తూనే ఆరాధిస్తుంటాడు. కానీ, కృష్ణ వ్యక్తిత్వం, ప్రవర్తన నచ్చి తనను ప్రేమిస్తున్నట్లు చెబుతుంది దీప్తి. ఆమె అన్నయ్య ఇన్‌స్పెక్టర్ రామరాజు (సునీల్)కు అసలు ప్రేమ అంటేనే గిట్టదు. తన చెల్లికి మంచి అందగాడ్ని చూసి పెళ్లి చెయ్యాలనుకుంటుంటాడు. తన చెల్లి కృష్ణతో ప్రేమలో ఉన్నట్లు రామరాజుకు తెలుస్తుంది. నలుపంటేనే గిట్టని రామరాజు అదే కారణంతో వాళ్ల ప్రేమకు అడ్డు చెబుతాడు. కృష్ణకు తెలియకుండా దీప్తిని విజయవాడ పంపించి అతనిపై దాడి చేస్తాడు. మరి తర్వాత కృష్ణకు ఏమైంది? కృష్ణ, దీప్తి ఎలా ఒక్కటయ్యారు? అన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే?
పేద ధనిక, కులాంతర, మతాంతర.. ఇలా తెలుగు ప్రేక్షకులు వెండితెరపై రకరకాల ప్రేమకథలు చూశారు. కానీ, వర్ణ వివక్షను ఇతివృత్తంగా చేసుకుని అల్లుకున్న ప్రేమకథలు ఇంతవరకు పెద్దగా రాలేదనే చెప్పొచ్చు. దర్శకుడు సందీప్ రాజ్ తొలి ప్రయత్నంలోనే ఇలాంటి విభిన్నమైన కథాంశాన్ని భుజానికెత్తుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం. దీనికి తగ్గట్టుగానే 1997 నేపథ్యాన్ని తీసుకుని కథకు పీరియాడికల్ టచ్ ఇవ్వడం, హాస్య నటుడు సుహాస్‌ను హీరోగా, సునీల్‌ను ప్రతినాయకుడిగా పరిచయం చేస్తూ సినిమాను రూపొందించడం వల్ల అందరి దృష్టి సినిమాపై పడేలా చేశారు. ఈ కథ గురించి చెప్పాలంటే.. "ప్రేమించిన వాళ్లను అందనంత ఎత్తులో నుంచో బెట్టడమే నిజమైన ప్రేమ" అన్న లైన్‌తో రాసుకున్నారు. దీనికి నలుపు - ఎరుపు రంగులను జోడించి, ప్రేమకు కులం, మతమే కాదు.. వర్ణం కూడా అడ్డుగోడగా నిలవొద్దని చెప్పే ప్రయత్నం చేశారు.
సందీప్ కథ ఎత్తుకున్న తీరు నుంచి దాన్ని ముగించిన విధానం వరకు ఆద్యంతం తడబాటు కనిపించింది. షార్ట్ ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌తో తెరపై మెరిసిన దర్శకుల్లో ఒక షార్ప్‌నెస్ కనిపిస్తుంది. సూటిగా సుత్తి లేకుండా కథ చెబుతుంటారు. కానీ, ఈ సినిమా విషయంలో అది లోపించినట్లు కనిపిస్తుంది. సినిమాలో ఎక్కువగా హీరో రంగు, ప్రేమ గురించే తప్ప మరే ధ్యాస లేదు. విరామానికి కానీ అసలు కథ మొదలు కాదు. ప్రథమార్ధమంతా కాలేజీలో సీనియర్లతో గొడవలు, తన ప్రేమను ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని హీరో పడే తాపత్రయమే కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో హీరో హీరోయిన్ల ప్రేమ పట్టాలెక్కడం, ఓ రెండు పాటలు, అంతలోనే ఆ ప్రేమకు కథానాయిక అన్నయ్య అడ్డు చెప్పడం, బెదిరింపులు, దాడులతో షరా మామూలే అయిపోయింది. దీంతో కథలో కొత్తదనమున్నా చివరకు ఒక రొటీన్ చిత్రం చూశామన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే!
సుహాస్‌కు హీరోగా తొలి చిత్రమైనా నటుడిగా తనకున్న అనుభవంతో జయకృష్ణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. తెరపై ఎక్కడా అతి చేసినట్లుగా కనిపించదు. దీప్తి పాత్రలో చాందినీ చౌదరి ఒదిగిపోయింది. సుహాస్ - చాందినీ మధ్య నడిచే లవ్ ట్రాక్ అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. కానీ, దాన్ని భావోద్వేగభరితంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు తడబడ్డాడు. నిజానికి ఇలాంటి కథలో భావోద్వేగాలు పండించడానికి మంచి ఆస్కారమున్నా, దర్శకుడు దాన్ని సరైన విధంగా తీర్చిదిద్దుకోలేదనిపిస్తుంది. సునీల్ ప్రతినాయకుడిగా కనిపించేందుకు చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకుల్లో మాత్రం తెరపై ఓ భీకరమైన విలన్‌ను చూస్తున్నామన్న భావన ఎక్కడా కలగదు. సుహాస్, వైవా హర్ష మధ్య వచ్చే కామెడీ ట్రాక్ అక్కడక్కడా నవ్విస్తుంది. కాలభైరవ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి.
బలాలు
- ఎంచుకున్న కథ
- సుహాస్, చాందినీ నటన
- సంగీతం
బలహీనతలు
- కథను నడిపించిన విధానం
- ముగింపు
చివరిగా: కలర్ ఫోటో.. అక్కడక్కడా మెప్పించే ప్రేమకథ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!