బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్యహత్య కేసుకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా సుశాంత్ వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి.. రియా చక్రవర్తిని సంప్రదించినట్లు అతని తండ్రి కేేకే సింగ్ తెలిపారు. అందుకు సంబంధించిన వాట్సాప్ సందేశాలను మీడియాతో పంచుకున్నారు.
సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా.. ఆ సందేశాలకు స్పందించలేదు. గతేడాది నవంబరు 29న సింగ్ పంపిన ఆ మెసేజ్‌ల్లో.. "నేను సుశాంత్ తండ్రినని తెలిసినప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు.? కారణం ఏంటి?. మీరు సుశాంత్‌ను ఒక స్నేహితుడిగా భావిస్తుంటే.. వివరాలు తెలుసుకోవడం తండ్రిగా నా భాద్యత. కాబట్టి నాకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పండి" అని సింగ్ పేర్కొన్నారు. రియాతో పాటు, ఆమె మాజీ మేనేజర్ శ్రుతి మోదీని సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.
రాజీవ్ నగర్ పోలీసు స్టేషన్లో సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సుశాంత్ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే రియాతో సహా ఆమె కుటుంబ సభ్యులను ఈడీ అధికారులు విచారించారు.
సుశాంత్ బంధువు నివాసానికి సీబీఐ
మరోవైపు హరియాణాలోని అత్యున్నత పోలీసు అధికారి, సుశాంత్ బంధువు ఓపీ సింగ్ నివాసానికి సోమవారం సీబీఐ వెళ్లింది. కేసు దర్యాప్తులో భాగంగా సుశాంత్ తండ్రి, సోదరి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. మంగళవారం సుశాంత్ సోదరి మితూ సింగ్‌ను తొలిసారి ఈడీ దర్యాప్తునకు పిలిచింది. రియా చార్టర్డ్ అకౌంకెంట్ రికార్డునూ ఈడీ నమోదు చేసుకుంది.
రియా పిటిషన్‌పై విచారణ
తనపై మీడియా అనవసరంగా నిందలు మోపుతోందని ఆరోపిస్తూ.. సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రియా. ఈ విషయంపై అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు(ఆగస్టు 11న) విచారణ జరపనుంది.