"ట్రెండ్ ఎన్ని రకాలుగా మారినా.. మానవీయ కోణంలోనూ, భావోద్వేగాల్లోనూ ఎలాంటి మార్పు ఉండదు. అవి కచ్చితంగా ఉండేలా చూసుకుంటా కాబట్టే విజయవంతంగా సినిమాలు చేస్తున్నా" అంటున్నారు ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్. ఇంటిల్లిపాదికీ నచ్చే సినిమాలు చేయడంలో దిట్ట ఆయన. తన సంస్థ 'శ్రీ స్రవంతి మూవీస్' పతాకంపై గుర్తుండిపోయే సినిమాలెన్నో చేశారు. ఆయన రామ్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం 'రెడ్'. సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ..

సినిమా కూడా పండగే..
"తెలుగు ప్రేక్షకులకు సినిమా కూడా ఓ పండగే. అంతగా ఇష్టపడతారు. ఈసారి వాళ్లు మరింత ఉత్సాహంగా థియేటర్‌కి వస్తారనుకున్నాం. ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలూ అది నిజమని నిరూపించాయి. ఓటీటీ బోర్ కొట్టేసి.. థియేటర్‌లో మళ్లీ మునుపటిలాగా సినిమాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పండగకి ఎన్ని చిత్రాలు విడుదలైనా అన్నీ చూడాలనే కోరికతో ఉంటారు ప్రేక్షకులు. ఏదైనా బాగా నచ్చిందంటే.. దాన్ని ఎక్కువసార్లు చూస్తారు. భావోద్వేగాలు, విలువలు ఉన్న సినిమా మా 'రెడ్'. సినిమా నుంచి బయటికొచ్చాక అందులోని పాత్రల గురించి, కథ గురించి ఆలోచింపజేస్తుంది. ప్రేక్షకుడిపై ప్రతి పాత్ర తనదైన ప్రభావం చూపిస్తుంది."

అందుకే థియేటర్లో..
"పెద్ద తెర కోసమే 'రెడ్' చేశాం. రామ్ రెండు పాత్రల్లో మంచి నటన ప్రదర్శించాడు. అది తెరపై చూస్తేనే ప్రేక్షకులు, అభిమానులు సంతోషిస్తారు. అందుకే ఈ సినిమాని ఓటీటీలో కాకుండా, థియేటర్లోనే విడుదల చేయాలని ఇన్నాళ్లూ ఎదురు చూశాం. మంచి సమయంలో వస్తోంది. మన అభిరుచులకి తగ్గట్టుగా మలిచిన ఓ చక్కటి రీమేక్ ఇది. స్రవంతి మూవీస్ నుంచి వచ్చే సినిమాలంటే వాటిలో కుటుంబ అంశాలు నూటికి నూరుపాళ్లు ఉంటాయి. 'రెడ్' కూడా ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది."