కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అన్నారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న అసత్య వార్తలను ఖండించారు. ఏ విషయాన్నైనా తమ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే ప్రచురించాలని మీడియాను కోరారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
"నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. అందుకు సమయం పడుతుంది. ఆయన ఆరోగ్యం విషయంలో భారీ మార్పులు ఏవీ లేవు. అందుకే నేనూ రోజూ అప్‌డేట్ ఇవ్వడం లేదు. ప్రతి రోజూ నాన్నను కలుస్తున్నా. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఇంకా ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయితే, ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు. మీ ప్రార్థనలు, ప్రేమాభిమానాల వల్ల ఆయన కోలుకుంటున్నారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నాన్న ఆరోగ్యానికి సంబంధించి ఒకట్రెండు రోజులకైనా నేను అప్‌డేట్‌లు ఇస్తూనే ఉన్నా. అయితే, కొన్ని మీడియా సంస్థలు ప్రచురిస్తున్న వార్తలను అనుసరించవద్దు. వాళ్లు ఎక్కడి నుంచి సమాచారం సేకరిస్తున్నారో తెలియదు. నాన్న ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతా. లేదా ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తాయి."
"నాన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, ఆయన ఊపిరితిత్తుల మార్పిడికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజం కాదు. ఒకే రోజు ఇలాంటి రెండు రకాల వార్తలు వచ్చాయి. ఆయన అభిమానుల కోసం ఐసీయూ నుంచి పాట పాడతారన్న వార్తలు కూడా వాస్తవం కాదు. దయచేసి మీడియా సంయమనం పాటించాలి. మీరు రాసే వార్తల వల్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఒక ఫేక్ న్యూస్ కారణంగా వందల కాల్స్‌కు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఏదైనా విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు నాకు గానీ, నా వ్యక్తిగత కార్యదర్శికి గానీ ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నాన్న పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి వస్తారని అందరం ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు" అని ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు.
ఇటీవల బాల సుబ్రహ్మణ్యానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ వచ్చింది. అయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు.