కరోనా వైరస్‌తో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. బాలు ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగైనట్లు ఎక్స్‌రేలో కనిపించిందన్నారు. 20 నిమిషాల పాటు కూర్చొని వ్యాయామాలు చేస్తున్నారని చెప్పారు. ఫిజియోథెరఫిస్టులు ఆయనతో వ్యాయామాలు చేయిస్తున్నారని చరణ్ వివరించారు.
కరోనా వైరస్ సోకిన కారణంగా ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఒకానొక దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల వైద్యులు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడం వల్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు.