ఆయన పాట సప్తస్వరాల సయ్యాట. కోవెలలో జేగంట. ఆ సంగీత విద్వన్మణి తెలుగు సినీగానానికి మంగళధ్వని. మధుర స్వరధుని. సప్తస్వర జ్ఞాని. గొప్ప విషయ పరిజ్ఞాని. దశాబ్దాల తెలుగు చలనచిత్ర రంగ నేపథ్య గాన ఊసులను గుండె ఘోషగా పలికించే విజ్ఞాన సర్వస్వం. ఆ సుమధుర గళం ఇలవేల్పుల దివ్యస్తోత్రం. వెండి తెరవేల్పులకు ప్రాణం. వెరసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. గానమే యోగంగా భాసిల్లే ధ్యాన సుబ్రహ్మణ్యం. విధాత తలపున ఏమి ప్రభవించిందో.. ఏం ప్రవహించిందో.. దశాబ్దాల పాటు ప్రేక్షకులకు ఆయన పాటే మంత్రమైంది. వివిధ్య గళ మాధుర్యంతో అందరికీ గాత్రదానం చేసే బహుపాత్రధారి బాలసుబ్రహ్మణ్యం.
తెలుగు నేపథ్య గానానికి ఆయన 'ప్రాణ సుబ్రహ్మణ్యం' శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అర్ధశతాబ్ద కాలంలో వేలాది గీతాలు ఆయన గాత్రం నుంచి రవళించాయి. సినీ నేపథ్య గానాన్ని సుసంపన్నం చేశాయి. దశభాషా గాయకుడిగా దశదిశలా భారతీయ సినీ గాన యశస్సును చాటిన ప్రతిభాశాలి. ఒకప్పుడు తెలుగు సినిమాకు నలుగురు అగ్ర హీరోలు. వారు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ. వీరందరికీ బాలు గానం చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ మూడు తరాల వారసులకు కూడా బాలు తన గళమిచ్చారు.
ఘంటసాల తర్వాత ఎవరు?
అలనాటి గాన గంధర్వుడు ఘంటసాల దివికి వెళ్లిపోయిన తర్వాత అప్పటి అగ్ర కథానాయకులకు గొంతు పెగలలేదు. చాలాకాలం తమ పాటలకు మరో గాయకుణ్ణి కలనైనా ఊహించలేకపోయారు. నిండైన తమ రూపాలకు తగినట్లు మెండైన గళంతో పాటలు పాడే వారికోసం చిత్రసీమ అన్వేషిస్తున్న సమయం. అందరికీ ఒకే గొంతుక అంటే మాటలు కాదు. అది పాట. స్వరవిన్యాసాలు, ఆవాహనలు అవశ్యం. అవన్నీ ఒంటబట్టించుకుని తెలుగు పాటంటే ధనాధన్.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే.
అలా గొంతు సవరించుకుని..
చెన్నైలో ఇంజనీరింగ్‌లో బీటెక్ స్థాయితో సమమైన ఏఐఎంఈ చేస్తున్న వేళ. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ.. ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా సరిగమల ఊసులే. సంగీతభాషలే. అంతరంగమంతా సంగీతమే. మనసంతా శృతిలయల పల్లకీలో విహరించేది. బాలు ఓ వైపు చదువుతూనే మరో వైపు ఇళయరాజా, ఆయన సోదరుడు గంగై అమరన్, మరికొందరు మిత్రులతో కలసి ఒక సంగీత బృందంగా ఏర్పడి.. తమిళనాట గ్రామగ్రామానా మ్యూజికల్ నైట్స్ లో పాల్గొన్నారు. ఆయన గాత్రం నాదవినోదం. సప్తస్వరాల ప్రమోదం. సరిగమలు వర్షించే మేఘమల్హరం. 1964లో ఒక సంగీత సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి వరించింది. ఆనాడు ఒక పాటల పోటీకి సంగీత దిగ్గజాలు సుసర్ల దక్షిణామూర్తి, ఎస్పీ కోదండపాణి, గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. వీరు ముగ్గురూ ఆయన గాత్రమాధుర్యాన్ని, సొగసైన స్వరాల విరుపులను, మెరుపులను గుర్తించారు.
తొలి అవకాశం
సంగీత దర్శకుడిగా లబ్దప్రతిష్ఠుడైన ఎస్పీ కోదండపాణి మరింతగా గుర్తించి తొలి అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలో 1966 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' కోసం 'ఏమి ఈ వింత మోహం' అనే పాటను ధ్వనిముద్రితం చేశారు. ఆ చిత్రం మరుసటి ఏడాది విడుదలైంది. 1968లో కోదండపాణి సుఖదు:ఖాలు చిత్రంలో 'మేడంటే మేడా కాదు' పాటతో మరో అవకాశమిచ్చారు. ఆ లేత స్వర మాధుర్యానికి తెలుగు సినీ ప్రేక్షకలోకం తీయగా ఉలిక్కిపడింది. 1968లో మంచిమిత్రులు సినిమాలో అనుకోని అవకాశం. అగ్రశ్రేణి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుతో కలిసి ఆ సినిమా కోసం 'ఎన్నాళ్లో వేచిన ఉదయం' గీతాన్ని పాడారు. చిత్రంగా ఆ పాటలో మాటలు బాలూకి వర్తించాయి. అదే ఏడాది ప్రేక్షకులను అలరించిన 'ఉండమ్మా బొట్టుపెడతా' చిత్రంలో సంక్రాంతి పౌష్యలక్ష్మిని స్వాగతించే గీతం 'రావమ్మా మహాలక్ష్మి రావమ్మా' బాలుకు ఎంతో పేరు తెచ్చింది. దశాబ్దాలపాటు ఆ పాట సంక్రాంతి పాటలకు మకుటాయమానంగా నిలిచింది.
1969లో విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన 'ఆత్మీయులు' సినిమాలో స్వరకర్త సాలూరు రాజేశ్వరరావు ఎస్పీ బాలుకు అవకాశమిచ్చారు. చంద్రమోహన్, చంద్రకళ మీద చిత్రించిన 'చిలిపినవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే..' యుగళం. ఈ గీతంలో బాలు స్వరవైవిధ్యాన్ని చూపారు.
బాలు గళం
ఆ తర్వాత మహదేవన్ స్వరకల్పనలో ఘంటసాలతో కలసి 'ప్రతీ రాత్రి వసంత రాత్రి' పాటను పాడే అవకాశం దక్కింది బాలూకు. 'తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో', 'కథానాయిక మొల్ల'లో తాత్వికతను ప్రతిబింబించిన 'మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్య' పాటతో బాలు తన ఉనికిని చాటుకున్నారు. సరిగ్గా అప్పుడే వరించింది మరో అద్భుత అవకాశం. కె.విశ్వనాథ్ సినిమా 'చెల్లెలికాపురం'లో 'ఆడవే మయూరీ' పాటతో బాలు చెలరేగి పాడారు. ఇక ఆ తర్వాత తన గాన మధురిమలను ప్రతి ఇంటా కురిపించారు. కానీ ఎంత ప్రయత్నించినా అగ్ర కథానాయకులు ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు పాడేందుకు అవకాశాలు రావటం లేదు. అడపాదడపా ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు అవకాశాలు ఇస్తున్నా ఏఎన్నార్ సినిమాల్లో అవకాశాలు అస్సలు రావటం లేదు. బాలుకు అదో వెలితిగా తోచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏ హీరోకు ఆ హీరోలా
"అవకాశాలు నీవే సృష్టించుకోవాలి, నాగేశ్వరరావుకి పాడితే నాగేశ్వరరావులా, రామారావుకి పాడితే రామారావులా ఆవహించి పాడాలి. అప్పుడే నీవు నిలదొక్కుకుంటావు" అని సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు చేసిన మంత్రోపదేశం బాలసుబ్రహ్మణ్యం భవిష్యత్తును దివ్యంగా తీర్చిదిద్దింది. ఆయన మాటలనే వేదవాక్కులుగా భావించారు. అలా ఆ స్ఫూర్తితో తొలిసారి 'ఆలుమగలు' సినిమాలో 'ఎరక్కపోయి వచ్చాను..ఇరుక్కుపోయాను' పాడారు. ఈ గీతం నుంచి ఎస్పీ బాలు నటులను ఆవహించి పాడటం నేర్చారు. నటీనటుల గాత్ర ధర్మాన్ని అనుసరించి పాడటం ప్రారంభించడం వల్ల బాలసుబ్రహ్మణ్యం స్వరవిన్యాసాలకు ప్రేక్షక లోకం మంత్రముగ్ధ మైంది. బాలసుబ్రహణ్యం గానయాత్ర క్రమంగా తారస్థాయికి చేరుతున్న సమయం. ఒకే రోజు దాదాపు 15 నుంచి 20 పాటలు పాడగలిగిన స్టామినా, గళబలం బాలు సొంతం. అంతేకాదు ఆయన పరకాయప్రవేశం చేసినట్లు పాడుతారు. సంగీతదర్శకులకు ఇదో వరమైంది. అంతే! బాలు ఇక వెనుదిరిగిచూసుకొలేదు. గళానికీ అభినయం ఉంటుందని, ఉందని, నిరూపించిన సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
1977లోనే 'దానవీర శూరకర్ణ'లో దుర్యోధన పాత్రధారి ఎన్టీఆర్‌పై సినారె పాట చిత్ర విచిత్రంగా, భళారే విచిత్రంగా పలకరించింది. అదేఏడాది ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన చాణక్య చంద్రగుప్తాలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరాల్లో 'చిరునవ్వుల తొలకరిలో' గీతం ఆకట్టుకుంది. 1979లో వేటగాడులో ఆకుచాటు పిందె తడిచె పాట, కొండ మీద చందమామా గీతాలు ప్రేక్షకులకు నచ్చాయి. బొబ్బిలిపులిలో బాలు గానం చేసిన జననీ జన్మభూమిశ్చ: గీతం అణువణువునా దేశభక్తి నింపింది. మళ్లీ పదకొండేళ్ల తరువాత.. అంటే ..1993లో మళ్లీ అటువంటి గీతమే మేజర్ చంద్రకాంత్ లో పాట ‘పుణ్యభూమి నాదేశం నమో:నమామీ.
ఏయన్నార్‌కు అలా..
గంధర్వ గాయకుడు ఘంటసాల దివికేగిన తరువాత కొంతకాలం నాటి అగ్ర కథానాయకుడు ఏయన్నార్ ఎక్కువ పాటలు విస్సంరాజు రామకృష్ణతో పాడించుకున్నారు. చివరికి బాలు గొంతునే ఎంచుకున్నారు. ఆలుమగలు చిత్రం నుంచి గానవైవిధ్యం ప్రదర్శిస్తూ అక్కినేనికి విలక్షణంగా పాడసాగారు బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల తరువాత బాలసుబ్రహ్మణ్యం అక్కినేని నాగేశ్వరరావుకు తన తొలిపాటను 1970లో గానం చేశారు. సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఇద్దరు అమ్మాయిలు అనే చిత్రంతో ఈ అవకాశం కల్పించారు. అయితే చాలాకాలం వరకు అక్కినేని బాలుతో పాటలు పాడించుకోలేదు. కానీ తాతినేని చలపతిరావు బాలు వాయిస్ తో ఆలుమగలు సినిమాలో చేసిన ప్రయోగం నాగేశ్వరరావుకు నచ్చింది. దాంతో అప్పటి నుంచి వారికి రాగబంధం ఏర్పడింది. ఆలుమొగలు పాట ఎరక్కపోయి వచ్చాను..ఇరుక్కుపోయాను.. అచ్చం నాగేశ్వరరావే పాడిన అనుభూతి కలిగించారు. అక్కినేని నాగేశ్వరరావుకు బాలు పాడిన చిటపట చినకుల మేళం పాట ఒకటి. 1980లో రావణుడే రాముడైతేలో రవివర్మకే అందని అందానివో, 1980లో ‘ఏడంతస్తుల మేడ సినిమాలో 'ఇది మేఘ సందేశమూ..' ఎంచదగినవి. ఇక అటు దాసరి నారాయణ రావుకి, ఇటు అక్కినేనికి ప్రతిష్ఠాత్మకమైన ప్రేమాభిషేకంలో అన్ని పాటలూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆగదూ-ఆగదూ, వందనం, అభివందనం కోటప్పకొండకు వస్తానని.. గీతాలలో బాలసుబ్రహ్మణ్యం అక్కినేనికి గానవిలక్షణత ను గమనించవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శోభన్ బాబు, కృష్ణకు
ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు. సాహసానికి మారుపేరు కృష్ణ. వీరిద్దరి సినిమాల్లో లభించిన ప్రోత్సాహంతో బాలు చిత్రసీమలో నిలదొక్కుకున్నారని చెప్పాలి. ఇంతకు ముందే ప్రస్తావించినట్లు 1971లో చెల్లెలికాపురంలో ఆడవే మయూరి గీతంతో తెలుగు సినీ నేపథ్య ప్రపంచంలో బాలు తన ఉనికిని బలంగా చాటుకున్నారు. మధుర స్వర మాంత్రికుడు కేవీ మహదేవన్ మనుషులు మారాలిలో హరనాథ్ కోసం తూరుపు సింధూరపు, మందారపు వెన్నెలలో, అలాగే శోభన్ బాబు-శారదలపై చిత్రీకరణకు పాపాయి నవ్వాలి, పండగే రావాలి గీతాలను పాడించటం వల్ల బాలుకు మంచి గుర్తింపు లభించింది. తెలుగు సినిమా చరిత్రలో సాహసంతో సినిమాలు తీస్తారని పేరున్న కృష్ణ అత్యంత విశ్వాసంతో సినీ రంగంలో దూసుకెళ్లారు. ఆయనకు బాలసుబ్రహ్మణ్యం స్వర విన్యాసాలు సరిగ్గా సరిపోయాయి. 1973లో వచ్చిన మాయదారి మల్లిగాడులో ఆయన కృష్ణ నవ్వుని బాగా ఔపాసన పట్టినట్లు నవ్వారు. నిజానికి తాతినేని చలపతిరావు సూచనలు చేయకముందే బాలసుబ్రహ్మణ్యం నటీనటుల గాత్ర ధర్మాలను అనుసరించే గానం చేసేవారు. ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో వీరికి గాత్రం చేశారు.
చిరంజీవి డ్యాన్స్‌కు బాలు గాత్రం తోడైతే..
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ తర్వాత తరంలో నాలుగు మూల స్తంభాలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. చిరంజీవి 1978లో నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదులో ఏతమేసి తోడినా పాట జాలాది కలంనుంచి ప్రవహించగా బాలు గళం నుంచి జాలువారింది. ఇది జీవన తాత్వికతకు అద్దంపట్టే హృద్య గీతం. 1984లో అభిలాష చిత్రంలో బంతీ చేమంతి పాట ఇళయరాజా కొత్త సంగీత సొగసులను పరిచయం చేసింది. 1984లో ఛాలెంజ్ చిత్రంలో ఇందువదనానికి చందనాలు అద్దిన వేటూరి పాటను ఇళయరాగాలతో తన గళం నుంచి బాలు ప్రేక్షకులకు చేర్చారు. 1988లో రుద్రవీణలో తరలిరాద తనే వసంతం, 1991లో విడుదలైన రౌడీ అల్లుడులో బప్పీలహరి స్వరాల్లో వెలువడిన చిలుకా క్షేమమా గీతాలు ప్రేక్షకులు కోరుకున్న కొత్తదనాన్ని అందించాయి. అదే ఏడాది గ్యాంగ్ లీడర్లో భద్రాచలం కొండ అనే గీతం, 1992లో ఘరానా మొగుడులో బంగారు కోడిపెట్ట పాటలు ఆకట్టుకున్నాయి. 1998లో చూడాలని ఉందిలో సింబలే..సింబలే గీతం, 2002లో ఇంద్ర లో ఘల్లు..ఘల్లు పాటలు బాలు గాత్ర వైవిధ్యానికి మచ్చుతునకలు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాలయ్యకు టాప్ సాంగ్స్
నందమూరి బాలకృష్ణకు బాలసుబ్రహ్మణ్యం హిట్ సాంగ్స్ ఇచ్చారు. మంగమ్మగారి మనవడులో దంచవే మేనత్తకూతురా, సీతారామ కల్యాణం లో కల్యాణ వైభోగమే, రక్తాభిషేకంలో బందారు చిన్నదాన, ఆదిత్య369 లో జాణవులే, వరవీణవులె, ధర్మక్షేత్రంలో కొరమీను కోమలం గీతాలు అభిమాన ప్రేక్షకలోకాన్ని మెప్పించాయి. 1993లో వచ్చిన బంగారుబుల్లోడులో గుడివాడ గుమ్మరో, మరో పాట స్వాతిలో ముత్యమంత, బొబ్బిలి సింహంలో మాయదారి పిల్లడా పాటలు సూపర్ హిట్స్. భక్తిప్రధాన చిత్రాలయిన పాండురంగడులో మాతృదేవోభవ పాట బాలు పాటల్లో ఒక తారస్థాయి గీతం. శ్రీరామరాజ్యంలో జగదానంద కారకా పాట దేశవిదేశాల్లో బాలసుబ్రహ్మణ్యం కు ఎనలేని, ఎల్లలు లేని కీర్తిని తెచ్చింది.
నాగ్కూ మంచి హిట్లు
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా రంగప్రవేశం చేసి, కొద్ది కాలంలోనే సొంత ముద్ర ఏర్పర్చుకున్న నటుడు, ఆయన తనయుడు నాగార్జున. ఆయన నటించిన ఆఖరిపోరాటం సినిమాలో లతామంగేష్కర్ తో కలసి బాలు పాడిన తెల్లచీరకు థకధిమి పాట అందరినోటా నానింది. శివ సినిమా కోసం బాలు, చిత్ర గానం చేసిన ఎన్నియల్లో.. మల్లియల్లో వైవిధ్యంగా సాగింది. ఒకప్పుడు వేటూరి కలం, బాలూ గళం, ఇళయరాజా స్వరం..ఈ కాంబినేషన్ ను కొట్టిందే లేదు. గీతాంజలి సినీగీతం ఓ పాపాలాలీ ఇందుకు ఉదాహరణ. ఇక 'నిర్ణయం'లో హలోగురు ప్రేమకోసమే పాట యువతరాన్ని ఆకర్షించింది. క్రిమినల్లో కీరవాణి మధురస్వరాలు అద్దిన తెలుసా, మనసా గీతం మధురతుషారాలు అద్దింది. అన్నమయ్యలో పురుషోత్తమా, కలగంటి..కలగంటి గీతాలు బాలు గళం నుంచి శృతి పక్వంగా ప్రవహించాయి. నువ్వు వస్తావని సినిమాలో పాటలపల్లకివై పాట ఓ మధుర గీతం. ఇక అన్నమయ్య తర్వాత అక్కినేని నాగార్జున తనను తాను నిరూపించుకున్న ఆధ్యాత్మిక చిత్రం శ్రీరామదాసు. ఈ సినిమాలో అంతా రామమయం, ఎంతో రుచిరా గీతాలు బాలు గళంతో ప్రాణం పోసుకున్నాయి.
వెంకీ 99 శాతం సినిమాలకు బాలు గాత్రమే
కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా పేరున్న వెంకటేశ్ కెరీర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలున్నాయి. 99 శాతం సినిమాలకు బాలసుబ్రహ్మణ్యమే పాడారు. అనేక విజయవంత గీతాలతో ప్రేక్షకులపై పన్నీరు చిలకరించారు. 1987లో గౌతమితో కలసి నటించిన శ్రీనివాసకల్యాణంలో తుమ్మెద.. ఓ తుమ్మెద పాట కలకాలం గుర్తుండిపోతుంది. 1988లో విశ్వనాథ్ చిత్రం స్వర్ణకమలంలో కొత్తగా రెక్కలొచ్చెనా పాటను ఎంతో సొగసుగా వెంకీని ఆవహించినట్లు గానం చేశారు. అదే ఏడాది ప్రేమ సినిమాలో హీరో హీరో, ప్రియతమా నా హృదయమా పాటలు ఆదరణ పొందాయి. 1990లో ప్రేక్షకులను పలకరించిన బొబ్బిలిరాజా లో బలపం పట్టు భామ ఒళ్లో, కన్యాకుమారి పాటలు శత్రువు లో సినిమాలో పొద్దున్నే పుట్టింది పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. శ్రీదేవితో కలసి నటించిన క్షణక్షణం లో జామురాతిరీ కీరవాణి స్వరాల్లో అలరించింది. 2001 నువ్వు నాకు నచ్చావ్‌లో ఆకాశం దిగివచ్చీ., 2007లోనే వెంకీకోసం ఆడవారి మాటలకు అర్ధాలే సినిమా పాటలకు బాలు ప్రాణం పోశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రతి పాత్రకు బాలు గాత్రమే
ఆయన ఒకే ఒక్కడు. తెరమీద ఎందరు కథానాయకులు ఉన్నప్పటికీ తెరవెనుక కథానాయకుడు ఒక్కడే. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దానకర్ణుడు. గాత్రదాన కర్ణుడు. అందరికీ పాటలిస్తాడు. కొందరికి మాటలిస్తాడు. నటనలో శారీరక భాషకు గళభాషను చేర్చిన ప్రతిభావంతుడు గానలోలుడు. 74 ఏళ్ల బాలుడు. అతడు అందరికోసం ఒక్కడుగా నిలిచిన ఒకే ఒక్కడు. తెరంగేట్రం చేసే ప్రతి హీరో, పాటపాడే ప్రతి పాత్రకు బాలు గాత్రమే. నాడు ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ పాటలు పాడారు. తర్వాత అదే తరంలో హరనాథ్, అల్లు రామలింగయ్య, కాంతారావు, పద్మనాభం, రాజబాబు, నాగభూషణం, చంద్రమోహన్, చలం, మురళీమోహన్ , రావుగోపాలరావు, కృష్ణం రాజు, రామకృష్ణ , రామ్మోహన్ , రంగనాథ్, నరసింహరాజు, హరిప్రసాద్, సత్యేంద్ర కుమార్, మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి, భానుచందర్, ఎన్టీరామారావు తనయులు బాలకృష్ణ, హరికృష్ణలకు పాటలు పాడారు. హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారక్ రత్నలకు పాట సాయం చేశారు. హీరో కృష్ణ కుటుంబంలో రమేశ్ బాబు, మహేశ్ బాబు, అందరి పాటలకు బాలు తన గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేశారు.