చక్కటి స్వరానికి, స్వచ్ఛమైన భాషోచ్చారణకు మారు పేరు బాలు. తమిళ సంగీత దర్శకుడు గంగై అమరన్ కూడా అలాంటి స్వరబంధువే. పామరులు హాయిగా గొప్పగా పరవశించేలా పాటకు బాణీలు కట్టే స్వర జ్ఞాని ఇళయరాజా. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఓ విధంగా చెప్పాలంటే ప్రాణమిత్రులు. ఓ సందర్భంలో బాలు, అమరన్‌లు జీవితంలో తాము పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఇళయరాజా సంగీత ప్రపంచంలో శిఖర స్థాయికి చేరడానికి ఎంత కష్టాపడ్డారో నెమరువేసుకున్నారు ఈ ఇద్దరు మిత్రులు.
"బాలూ.. గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అని అంటుంటావే. మన జీవితాల్లోకి తిరిగి చూసుకున్నప్పుడు మనం సాధించిన వాటికన్నా మనం పడ్డ కష్టమే ఎక్కువ గుర్తొస్తుందని నువ్వు పలుమార్లు అంటావే.." అని గంగై అమరన్ అంటే దానికి బాలు ఒక్కసారి తను జీవితపు తొలినాళ్లలోకి వెళ్లి ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘
"మనందరం ఇతర ప్రాంతాలకు కచేరీలకు వెళ్లి రైలులో తిరిగి రావడానికి వాళ్లు డబ్బులిచ్చేవారు గుర్తుందా. వాటితో నువ్వు, ఇళయరాజా, భాస్కర్...అందరం టీ, బన్ కొనుక్కొని తిని డబ్బును మిగుల్చుకుని ఇంట్లో ఇచ్చేవాళ్లం. అప్పట్లో పాటకి రూ.150 పారితోషికం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రూ.30 వేలు పారితోషికం స్థాయికి పెరగడానికి మనం చేసిన కృషి అంతా ఇంతా కాదు. డబ్బుకోసం నాలా కష్టపడేవాడు ఎవరూ లేరు. ఇళయరాజా సంగీత దర్శకుడు కావడానికి పడ్డ కష్టం కూడా అప్పుడప్పుడూ నా కళ్లముందు మెదులుతుంది. జెమిని ఎస్.ఎస్.వాసన్ కొత్త సంగీత దర్శకుడి కోసం వెతుకుతున్నారని తెలిసి మనందరం తలా కొంచెం డబ్బు వేసుకొని నాలుగైదు పాటల్ని రికార్డింగ్ చేయించి రాజాకిస్తే వాటిని తీసుకెళ్లి ఇచ్చేలోపు ఆ అవకాశం చేజారడం నాకు ఇంకా గుర్తే. ఓ సారి నేను, జానకి పాడిన పాట రికార్డింగ్ అయిన తర్వాత నిర్మాత కనిపించలేదు. మరోసారి కంపోజింగ్ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. రాజాకి చాలా కోపమొచ్చింది. ‘ఈ జన్మలో నేను సంగీత దర్శకుడిని కాలేను’ అని కూడా అన్నారు. ఆ తర్వాత పుంజు అరుణాచలం చలవతో రాజా జీవితమే మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు కాబట్టే రాజా ఈ స్థాయిలో ఉన్నారు" అని గుర్తు చేసుకున్నారు బాలు.