తమిళంలో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి కథానాయిక ప్రాధాన్యం కలిగిన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నయనతార. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయన్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నాయికగా మారినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ. 6 కోట్లు తీసుకుంటున్న ఈ అమ్మడు... తాజాగా మరింత పెంచినట్లు వార్తలు వస్తున్నాయి.
అప్పట్లోనే కోటి...
2010లో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'పయ్యా' చిత్రంలో తొలుత నయనతారను ఎంచుకున్నారు. ఆ సినిమాకు ఆమె ఏకంగా రూ.కోటి పారితోషికం అడగడం వల్ల ఆ ఛాన్స్ తమన్నాకు దక్కింది. అప్పట్లో నయన్ రేటుకు కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఆశ్చర్యపోయాయి. అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఆమె పారితోషికం రూ.6 కోట్లకు పెరిగిందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వచ్చాయి. చిరంజీవితో 'సైరా', విజయ్‌తో 'బిగిల్', రజనీకాంత్‌తో 'దర్బార్'లో నటించినందుకు దాదాపు ఇంతే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
నయన్@8..
తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్ నిర్మాణంలోని 'నెట్రిక్కన్' చిత్రంలో నటిస్తోంది నయనతార. ఈ చిత్రానికి మిలింద్‌రావ్ దర్శకుడు. ఇందులో పాత్రకు భారీ స్థాయిలో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 2019లో మంచి హిట్లు రావడం వల్ల ఈ సినిమాకు దాదాపు 8 కోట్ల వరకు పారితోషికానికి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత ఐసరి గణేశ్ నిర్మించనున్నాడు. ఇతడు గతంలో ఎల్కేజీ, కోమలి, పప్పి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో ఇటీవల నయనతార నటించిన 'నానుం రౌడీదాన్' చిత్రంలో వినికిడిలోపమున్న అమ్మాయిగా నటించి మెప్పించింది. ఇప్పుడు 'నెట్రిక్కన్'లో కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తున్నట్లు కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి.
పది కోట్లను వద్దన్న నటి...
ఇంత భారీగా రెమ్యునరేషన్ తీసుకొనే నయన్... కథ నచ్చకపోతే సినిమాలు చెేయదనీ ఇటీవలె నిరూపించింది. ఓ నిర్మాత తన సినిమాలో నటించేందుకు రూ. 10 కోట్లు ఆఫర్ చేయగా నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం.
శరవణ్ అనే నూతన కథానాయకుడితో ఓ సినిమా తెరకెక్కించేందుకు కోలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయట. ఇందులో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసి ఆమెను సంప్రదించిందట చిత్రబృందం. అంత పెద్ద మొత్తంలో పారితోషకం ఇస్తానన్నా.. కథ నచ్చకపోవడం వల్ల ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట నయన్.