బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను సైబర్ బెదిరింపులకు గురి చేసి, అభ్యంతరకర భాషను ఉపయోగించిన యువకుడిని ముంబయి సైబర్ క్రైమ్ పోలీసుల విభాగం అరెస్టు చేసింది. తన సమస్యపై సత్వర చర్యలు తీసుకున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది సోనాక్షి.
"ఈ విషయంలో అండగా నిలబడినందుకు ముంబయి సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు నా కృతజ్ఞతలు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడానికే ఈ విషయం వెల్లడించాను. తద్వారా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతరులు కూడా ధైర్యంతో ముందడుగు వేస్తారు. అబ్ బస్(ఇక చాలు) ఆన్లైన్ దుర్వినియోగాన్ని చూస్తూ మేం అసలు ఊరుకోం"
సోనాక్షి సిన్హా, సినీ నటి
మహిళలపై ఆన్లైన్ వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మిషన్ జోష్ సహకారంతో 'అబ్ బస్' అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది సోనాక్షి. ఈ క్రమంలోనే వేధింపులకు గురైన వారికి వీలైనంత సాయం చేసే ప్రచారంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.
అసలేం జరిగిందంటే?
ఇటీవలే సోనాక్షి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆన్లైన్ వేధింపులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. అయితే కొంతమంది వినియోగదారులు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే సోనాక్షి బృందం సైబర్ పోలీసులను ఆశ్రయించింది.
విచారణలో ఔరంగబాద్‌కు చెందిన శశికాంత్ జాదవ్(27) నిందితుడిగా తేలాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాదవ్ సోనాక్షిని మాత్రమే కాకుండా.. చాలామంది నటీనటులపై వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అంతర్జాలాన్ని సురక్షిత ప్రదేశంగా మార్చడంలో సైబర్ పోలీసులు కీలక పాత్ర వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని అన్నారు.