Mohan babu son of india: సీనియర్ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. మరికొన్నిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 'సన్ ఆఫ్ ఇండియా' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. చిత్రబృందం సమక్షంలో జరిగిన ఈవెంట్‌లో మోహన్‌బాబు మాట్లాడుతూ.. జీవితంలో కొన్ని విషయాల్లో రిస్క్ చేయక తప్పదన్నారు. నటుడు, నిర్మాతగా తన కెరీర్ ఎలా ప్రారంభమైందో చెప్పారు.
Mohanbabu manchu vishnu: "సినిమా నా ఊపిరి అన్నారు మా గురువుగారు. అలాగే మా కుటుంబానికీ సినిమానే ఊపిరి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పొట్ట చేత పట్టుకుని వచ్చాను. నటుడు, నిర్మాతగా సంపాదించాను. సంపాదించిన దాన్ని విద్యాసంస్థలకు ఖర్చుపెట్టాం. కుల,మతాలకు అతీతంగా కొంతమందికి ఉచిత విద్య అందిస్తున్నాం. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. 35 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇప్పుడు అదొక విశ్వవిద్యాలయమైంది. అంతకంటే విజయాల గురించి ఎక్కువగా చెప్పాలనుకోవడం లేదు. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. సినిమా అంటేనే ఒక రిస్క్. 1982లో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ స్థాపించాను. నాకు ఎవరూ ప్రోత్సాహం అందించలేదు. ధైర్యంతో నిర్మాతగా ముందు అడుగు వేశా. అప్పట్లో సుందర్ అనే ఒక టాప్ రచయిత ఉండేవారు. ఆయన నాకు 50 కథలు చెప్పారు. వాటిల్లో ఏదీ నాకు నచ్చలేదు. చివరిగా ఒకే ఒక్క కథ చెప్పమని అడిగా.. చెప్పారు. అది నాకు బాగా నచ్చిందని చెప్పగానే.. కన్నడలో అదే కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అయ్యిందని ఆయనే చెప్పారు. కానీ, నేను రిస్క్ చేసి, సినిమా చేశా. సక్సెస్ అయ్యా. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఇల్లు అమ్మేసి రోడ్డున పడాల్సిన పరిస్థితి. అప్పుడప్పుడు రిస్క్ చేయాలని నేను నమ్ముతుంటాను. రత్నబాబు నన్ను కలిసి 'సన్ ఆఫ్ ఇండియా' కథ చెప్పగానే ఓకే అన్నాను. వెంటనే విష్ణుకు ఫోన్ చేసి 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పా. సాధారణంగా విష్ణు.. 'ఒక్కసారి ఆలోచిద్దాం నాన్నా' అనేవాడు. కానీ, ఆరోజు ఏం మాట్లాడకుండా 'సన్ ఆఫ్ ఇండియా' టైటిల్ లోగో క్రియేట్ చేసి పంపించాడు. విష్ణు ఒకవేళ ఆ రోజు 'నో' అని ఉంటే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు. ఇదొక పవర్‌ఫుల్ కథతో తెరకెక్కిన చిత్రం. దీని కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కేవలం ఒక్క పాటలోని గ్రాఫిక్స్ కోసమే రూ.1.80 కోట్లు ఖర్చు పెట్టాం" అని మోహన్‌బాబు చెప్పారు.