చిత్రం: సన్ ఆఫ్ ఇండియా; నటీనటులు: మోహన్‌బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, తనికెళ్ల భరణి, అలీ, సునీల్ తదితరులు; సినిమాటోగ్రఫీ: సర్వేశ్ మురారి; ఎడిటింగ్: గౌతం రాజు; సంగీతం: ఇళయరాజా; నిర్మాత: మంచు విష్ణు; రచన, దర్శకత్వం: డైమండ్ రత్నబాబు; బ్యానర్: 24 ఫ్రేమ్స్, ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్; విడుదల: 18-02-22
ఈ వారం ప్రేక్షకుల తీర్పుని కోరుతూ దాదాపుగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో చెప్పుకోదగ్గ ఒకే ఒక్క చిత్రం అగ్ర నటుడు మోహన్‌బాబు నటించిన 'సన్ ఆఫ్ ఇండియా'. మిగిలిన సినిమాల్లో దాదాపుగా కొత్త తారలు నటించినవే. 'సన్ ఆఫ్ ఇండియా' కూడా ఓటీటీ వేదికలే లక్ష్యంగా తీసిన సినిమా, కానీ థియేటర్లలో విడుదల చేశారు. మరి చిత్రం ఎలా ఉంది? 'సన్ ఆఫ్ ఇండియా' ద్వారా మోహన్‌బాబు ఏం చెప్పాలనుకున్నారు?
కథేమిటంటే: కడియం బాబ్జీ (మోహన్‌బాబు) ఓ డ్రైవర్. ఎన్.ఐ.ఎ అధికారిణి ఐరా (ప్రగ్యా జైశ్వాల్) దగ్గర పనిచేస్తుంటాడు. కేంద్రమంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్)తోపాటు మరో ఇద్దరు కిడ్నాప్ అవుతారు. ఆ కేస్‌ని ఛేదించడం కోసం రంగంలోకి దిగుతుంది ఐరా నేతృత్వంలోని ఎన్.ఐ.ఎ బృందం. ఆ మూడు కిడ్నాప్‌లకి సూత్రధారి బాబ్జీనే అని తేలుతుంది. బాబ్జీ అసలు రూపం కూడా అది కాదు. అతని అసలు పేరు విరూపాక్ష. పదహారేళ్లు జైలు జీవితాన్ని గడిపిన ఓ వ్యక్తి. ఇంతకీ విరూపాక్ష గతమేమిటి? అతను కిడ్నాప్‌లకి పాల్పడటానికి కారణమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే..
చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్టే ఈ సినిమాని ఓ ప్రయోగంలానే తీశారు. సింహభాగం సన్నివేశాల్లో మోహన్‌బాబు మాత్రమే కనిపిస్తుంటారు. మిగతా పాత్రలు కనిపించకుండా, కేవలం వినిపిస్తుంటాయంతే. తనకి జరిగిన అన్యాయంపై ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకోవడం, తనలా ఇంకెవ్వరికీ జరగకూడదని సాగించే పోరాటమే ఈ కథ. కొత్త కథ కాదు కానీ, దాన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా అనిపిస్తుంది. పేదోడికి ఓ న్యాయం, పెద్దోళ్లకి ఓ న్యాయమా అని ప్రశ్నించిన తీరు.. దేశవ్యాప్తంగా జైళ్లలో అన్యాయంగా మగ్గుతున్న 40 వేల మందికి పైగా నిరపరాధుల గురించి కథలో ప్రస్తావించిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ కథ చిరంజీవి గళంతో మొదలవుతుంది. మోహన్‌బాబు పాత్రని పరిచయం చేసిన విధానం బాగుంది. ఆ తర్వాత బాబ్జీ వరుసగా చేసే కిడ్నాప్‌లు ఆసక్తిని రేకెత్తిస్తాయి.
ద్వితీయార్ధంలో కిడ్నాప్‌ల వెనక కారణాలు, విరూపాక్ష గతాన్ని ఆవిష్కరించారు. గంటన్నర నిడివి ఉన్న చిత్రమిది. మోహన్‌బాబు పాత్ర, ఆయన మార్క్ సంభాషణలు బాగున్నాయి తప్ప కథ, కథనాల పరంగా పెద్దగా ప్రభావం చూపించదు. ఏ దశలోనూ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేకెత్తించదు. విరూపాక్ష కుటుంబ నేపథ్యాన్ని భావోద్వేగభరితంగా చూపించి ఉంటే బాగుండేది. సునీల్, అలీ, బండ్ల గణేష్, పృథ్వీ తదితర హాస్యనటులున్నా ఆ సన్నివేశాలు పెద్దగా నవ్వించవు. ఓటీటీ కొలతలతో రూపొందిన సినిమా ఇది. అందుకు తగ్గట్టే కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఘాటుగా అనిపిస్తాయి. ఓటీటీని దృష్టిలో పెట్టుకునే కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. కథని ముగించిన తీరు బాగుంది.
ఎవరెలా చేశారంటే?:
మోహన్‌బాబు వన్ మేన్ షో ఇది. సినిమా ప్రారంభంలో మోహన్‌బాబు చెప్పినట్టుగానే అంతా ఆయన ఏకపాత్రాభినయంలానే ఉంటుంది. మిగతా పాత్రలు కనిపించవా అంటే కనిపిస్తాయి కానీ, వాటిని బ్లర్ చేస్తూ, లేదంటే వెనక నుంచి చూపిస్తూ కెమెరాతో మేజిక్ చేశారు. తెరపై నటులు లేకపోయినా ఉన్నట్టు భ్రమింపజేస్తూ, కేవలం వాళ్ల గళాన్ని వినిపిస్తూ సినిమా తీయడం మాత్రం ప్రయోగమే. ఇలాంటి ప్రయోగం అన్నిసార్లూ అందరికీ సాధ్యమయ్యేది కాదు. కరోనా సమయంలో తీసిన సినిమా కాబట్టి ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవడంతోపాటు, బడ్జెట్‌ని అదుపు చేయడంలో భాగంగా చేసిన ప్రయోగం అనిపిస్తుంది. ప్రగ్యాజైస్వాల్‌తోపాటు, 20 మందికిపైగా నటులున్నా వాళ్లు పతాక సన్నివేశాల్లోనూ, మిగతా చోట్ల అక్కడక్కడా కనిపిస్తారంతే. సాంకేతిక విభాగాలు పర్వాలేదనిపించాయి. రఘువీర గద్యంతో కూడిన పాటొక్కటే ఉంది. డైమండ్ రత్నబాబు రాసుకున్న కథలో కానీ, అందులో స్పృశించిన అంశాల్లో కానీ కొత్తదనమేమీ లేదు. కథనం పరంగా మాత్రం పర్వాలేదనిపించారు.
బలాలు
+ మోహన్‌బాబు నటన
+ సంభాషణలు
+ కథలో సందేశం
బలహీనతలు
- తెలిసిన కథ
- భావోద్వేగాలు పండకపోవడం
చివరిగా: మోహన్‌బాబు వన్ మేన్ షో... సన్ ఆఫ్ ఇండియా
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Bhimla Nayak: భీమ్లానాయక్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనా?