singer sunitha padutha theeyaga: సంగీత ప్రపంచంలో ప్రతిభావంతులైన గాయనీ గాయకులను గుర్తించి వారి భవిష్యత్‌కు చక్కటి మార్గాన్ని నిర్దేశించే వేదిక 'పాడుతా తీయగా'. తెలుగింటి ఛానల్ ఈటీవీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 1996 మే 16న మొదలై సుమారు 18 ఏళ్లపాటు ఎంతో వైభవంగా సాగిన ఈ పాటల పోటీ.. ఎందరో గాయనీ గాయకులను తయారు చేసింది. ఎంతో మంది సంగీత విద్వాంసుల ప్రశంసలందుకుంది. దక్షిణాదిన తొలి పాటల పోటీగా నిలిచి తెలుగు లోగిళ్లను సంగీతమయం చేసింది. చిన్నా పెద్దా.. ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేకుండా సప్తసముద్రాల ఆవల కూడా తన గానాన్ని వినిపించింది. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని స్వల్ప విరామం తర్వాత మళ్లీ మొదలుపెట్టింది ఈటీవీ(padutha theeyaga 2021). ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'పాడుతా తీయగా'కు ప్రముఖ నేపథ్య గాయనీ సునీత, విజయ్ ప్రకాశ్, చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
'పాడుతా తీయగా'తో ప్రత్యక్షంగా ఎంతో అనుభవాన్ని, అనుబంధాన్ని పెనవేసుకున్న నేపథ్య గాయనీ సునీత. తన మధురమైన గాత్రంతో ఎన్నో వేళ పాటలు పాడిన సునీత 'పాడుతా తీయగా'లో అప్పుడప్పుడు అతిథిగా వచ్చి ఔత్సాహిక గాయనీ గాయకులను సలహాలు సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేసేవారు. ఎస్పీబీతో కలిసి న్యాయనిర్ణేతగానూ విజేతలను ఎంపిక చేసిన అనుభవం ఆమెది. అలాంటి సునీత న్యాయనిర్ణేతగా మరోసారి పాడుతా తీయగా వేదికగా తన తియ్యనైనా మాటలు కమ్మనైనా పాటలతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. ఈసారి 'పాడుతా తీయగా'లో ఇప్పటి వరకు ఏ వేదికపై పాటలు పాడని కొత్త గాయనీ గాయకులను పరిచయం చేస్తున్నామని చెప్పారు. వారిలోని ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడమే తన బాధ్యత అని చెప్పిన సునీత.. ఔత్సాహిక గాయనీ గాయకుల బంగారు భవిష్యత్‌కు దారిచూపే గురతర బాధ్యత కూడా వీక్షకులకు ఉందని అన్నారు.
ఇదీ చూడండి: సుస్వరాల 'పాడుతా తీయగా'.. ఇక ఎస్పీ చరణ్ సారథ్యంలో