ETV Bharat / sitara

పాటే ప్రాణమూ.. మనసే గానమూ! - Singer SP Balu biography

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనే మనమంతా ఆప్యాయంగా పిలుచుకునే ఎస్పీ బాలు. అసమాన ప్రతిభా పాటవాలతో వేలాది పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు. తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు. నెల్లూరులో పుట్టి.. సంగీత ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సంగీత సామ్రాట్‌ మననుంచి దూరమైనా పాట రూపంలో చిరంజీవిగా నిలిచే ఉంటారు.

SP Bala Subrahmanyam
సకల కళావల్లభుడి స్వరానికి అభిషేకం
author img

By

Published : Sep 26, 2020, 10:28 AM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలో ఎస్పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు. వారిలో ఒకరు మనందరికీ సుపరిచితమైన గాయకురాలు ఎస్పీ శైలజ. బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రి. కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి. పాటే పంచప్రాణాలుగా అసమాన ప్రయాణం సాగించిన బాలు.. పాటలో ప్రధానమైన పల్లవి, చరణం అన్నమాటల్నే తన పిల్లల పేర్లుగా పెట్టుకోవడం విశేషం.

Singer SP Bala Subramanyam Special Story
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

సంగీతంపై ఆసక్తి

యువకుడిగా ఉన్నప్పటి నుంచే సరిగమలపై మక్కువ కలిగిన ఎస్పీబీ.. చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతుండగా సంగీతం నేర్చుకున్నారు. అలా 1964లో జరిగిన ఓ పాటల పోటీలో.. ఉద్ధండ సంగీతజ్ఞులు ఘంటసాల, కోదండపాణిల మెప్పు పొంది మొదటి బహుమతి గెలవడం.. ఆయన సినీ సంగీత ప్రస్థానానికి నాంది పలికింది. అప్పటినుంచి కోదండపాణి మాస్టారి శిష్యుడిగా మారిపోయిన బాలు.. 1966లో ఆయన సంగీతం అందించిన 'శ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమా కోసం మొదటి పాట పాడారు. అనంతరం 8 రోజుల వ్యవధిలోనే కన్నడ చిత్రం కోసం గానాలాపన చేశారు. అలా మొదలైన ఆయన సినీ సంగీత ప్రయాణం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 54 ఏళ్ల పాటు నిర్విరామంగా సాగింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సహా మొత్తం 16 భారతీయ భాషల్లో పాటలు పాడారు. సుబ్రహ్మణ్యం పాట వింటుంటే చెవిలో తేనె పోసినట్టు ఉంటుంది. అంత అద్భుతమైన గాత్రమాధుర్యం కలిగిన ఆ మహనీయుడు పాడని రాగం లేదు. గీతాలాపనలో చూపించని ప్రత్యేకత లేదు. పిల్లవాడి స్వరం పలికించడం నుంచి పండు ముదుసలికి గాత్రం అందించడం వరకు.. మధురాతి మధురమైన గానం నుంచి గంభీరమైన గొంతు వినిపించడం వరకు... భక్తి, రక్తి, విరక్తి, విషాదం, ప్రేమ, కసి, ద్వేషం, మధురం.. ఇలా పాట ఏదైనా అన్నింటా తనకే సొంతమైన ముద్ర వేశారాయన. మరెవ్వరికీ సాధ్యం కాదన్నంతగా... సినీ సంగీతం ఉన్నన్ని రోజులూ గుర్తుంచుకునేంతగా... తనకు తానే సాటి అని ఘనంగా చాటారు.

తొలి జాతీయ పురస్కారం

1980లో వచ్చిన 'శంకరాభరణం' చిత్రం... ఎస్పీ బాలు సినీ ప్రయాణంలో చిరస్మరణీయం. తెలుగునాట ఆ సినిమా ఎంత అజరామరమో... సంగీతమూ అంతే. ఒకరకంగా చెప్పాలంటే ఆ సినిమా, అందులోని సంగీతం వేర్వేరు కాదు. సంగీతమే సినిమా, సినిమానే సంగీతం అన్నట్లుగా సాగుతుంది. అలాంటి చిత్రంలో.. కేవీ మహదేవన్ సంగీత దర్శకత్వంలో అనన్యసామాన్యమనే స్థాయి గీతాలాపనతో యావత్‌ సంగీత ప్రపంచాన్ని బాలు మెప్పించారు. సంగీత ప్రపంచమంతా తనవైపు చూసేలా చేశారు.

అప్పటిదాకా సాగిన ఆయన సంగీత పయనం ఓ ఎత్తు. ఆ తర్వాత మరో ఎత్తు అని చెప్పవచ్చు. శంకరాభరణం పాటకుగానూ బాలుకు మొదటిసారి ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం దక్కింది. ఆ తర్వాతి సంవత్సరమే బాలు స్వరమాధుర్యాన్ని చవిచూసింది హిందీ సినిమా. 1981లో వచ్చిన 'ఏక్ దూజే కేలియే' సినిమాకు ఆయనకు రెండో జాతీయ అవార్డు వచ్చింది.

అన్ని భాషల్లో స్వరాన్ని..

ఈ సుదీర్ఘ ప్రస్థానంలో చాలా తక్కువ మంది మినహా ఆయన పనిచేయని సంగీత దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. అలాగే కలిసి పాడని గాయనీ, గాయకులూ ఉండరేమో. నాటి ఎన్టీఆర్​, ఏయన్నార్​ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్​, నాగచైతన్య వరకు అన్ని భాషల్లోనూ బాలు గళం అందించని నటులూ అరుదేనని చెప్పవచ్చు. ఆ సంగీత జ్ఞానిని ఒక్కసారి కలిస్తే చాలు అని భావించే సంగీత నిపుణులు, గాయనీ-గాయకులకు కొదవలేదు. ఇక సామాన్య ప్రజానీకం సంగతి చెప్పేదేముంది.

ఇళయరాజాతో అనుబంధం

ఇసై జ్ఞానిగా సంగీత ప్రపంచంలో అనితర సాధ్యమైన ముద్రవేసిన ఇళయరాజాతో ఎస్పీబీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇళయరాజా సినీ ప్రయాణం ప్రారంభం కాకముందు నుంచే బాలుతో కలిసి పనిచేశారు. అప్పట్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన సంగీత వేడుకల్లో బాలు పాడిన పాటలకు సంగీతం అందించిన బృందంలో ఇళయరాజా ఒకరు. తర్వాతి కాలంలో ఆయన సంగీత దర్శకుడిగా ఎదిగాక ఈ గాన గంధర్వుడితో లెక్కలేనన్ని పాటలు పాడించారు.

1970వ దశకం చివరి సంవత్సరాల నుంచి మొదలై దాదాపు 1990 వరకు ఇళయరాజా సినిమాల్లోని అత్యధిక గీతాలకు ఎస్పీ బాలు, ఎస్‌.జానకి స్వరం అందించారు. ఈ ముగ్గురూ కలిసి తమిళనాట సరికొత్త సంగీత చరిత్ర సృష్టించారు. తర్వాతి కాలంలోనూ ఆ ఒరవడి అలా కొనసాగింది. ఇటీవల వరకు ఇద్దరూ కలిసి సంగీతోత్సవాలూ నిర్వహించారు. అలాగే 'స్వాతిముత్యం', 'రుద్రవీణ' సినిమాలకు ఎస్పీబీతో పాటు రాజా కూడా జాతీయ పురస్కారాలు అందుకోవడం విశేషం.

అరుదైన రికార్డు

మన గాన గంధర్వుడిపై ఎప్పటికీ చెరిగిపోని అరుదైన రికార్డు ఉంది. అదేంటంటే... ఆయన ఒక్కరోజులో 21 పాటలు ఆలపించి.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించారు. 1981 ఫిబ్రవరి 8న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల వ్యవధిలోనే కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్‌ నేతృత్వంలో బెంగళూరు వేదికగా 21 పాటలు పాడి చరిత్ర సృష్టించారు.

పురస్కారాలు

బాలు అత్యద్భుత ప్రతిభకు తగ్గట్టే.. లెక్కలేనన్ని పురస్కారాలు ఆయన్ని వరించాయి. పాటలకు ప్రాణం పోసిన బాలు.. సంగీత ప్రయాణంలో 6 జాతీయ పురస్కారాలు గెలిచారు. అలాగే తెలుగునాట ఏకంగా 25 నంది అవార్డులతో భళా అనిపించారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచీ అనేక పురస్కారాలూ అందుకున్నారు. హిందీ పాటకు గానూ ఓసారి, దక్షిణభారత పాటలకు ఆరు పర్యాయాలు ఫిల్మ్ ఫేర్ సాధించారు.

2012 సంవత్సరానికి గాను ఎన్టీఆర్​ జాతీయ పురస్కారం ఎస్పీబీని వరించింది. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా... 2016లో సిల్వర్ పీకాక్ మెడల్ వచ్చింది. ఇక భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీని 2001లోనూ, పద్మభూషణ్‌ అవార్డును 2011లోనూ అందుకున్నారు.

సకల కళావల్లభుడు

సంగీత దర్శకత్వం, గీతాలాపనే కాకుండా ఇతర రంగాల్లోనూ బాలు సత్తా చాటారు. నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ కళాకారుడిగానూ తిరుగులేదని నిరూపించుకున్నారు.

స్వరానికి అభిషేకం

ఉషాకిరణ్‌ మూవీస్ సినీ నిర్మాణ సంస్థతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఉషాకిరణ్‌ సంస్థలో ఎన్నో చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం చేశారు. అలాగే అనేక పాటలకు గళం అందించారు. తెలుగు పలుకంటే ప్రాణంగా ప్రేమించే బాలుకు.. తెలుగుకు అగ్రపీఠం వేసే ఈనాడు, ఈటీవీలతోనూ మంచి అనుబంధం ఉంది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే సమున్నత లక్ష్యంతో ఈటీవీలో ప్రారంభించిన "పాడుతా తీయగా" కార్యక్రమానికి నిర్దేశకుడిగా, న్యాయమూర్తిగా వ్యవహరించారు.

ఆ కార్యక్రమం ద్వారా ఎంతోమందిని సంగీత కళాకారులుగా తీర్చిదిద్ది.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టడానికి కారణభూతులయ్యారు. తర్వాతి కాలంలో పాటకు పట్టాభిషేకం చేస్తూ ఈటీవీ ప్రారంభించిన 'స్వరాభిషేకం' కార్యక్రమంలో మమేకమై.. అలనాటి గీతాల నుంచి సరికొత్త పాటల వరకు అన్నిరకాలు ఆలపిస్తూ... ప్రతి ఆదివారం తెలుగు వీక్షకుల్ని మైమరపింపజేశారు.

ఇదీ చదవండి: గాన గంధర్వుడికి అంతిమ వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.