సిద్ధాంత్ చతుర్వేది.. చేతినిండా ఆఫర్లతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలీవుడ్ నటుడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమవడం వల్ల సరదాగా తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఈ క్రమంలోనే మొదటిసారి తాను ఇష్టపడ్డ అమ్మాయికి ఓ కవిత రాసి ఇచ్చానని, అయితే ఆమె దానిని తిరస్కరించిందని చెప్పాడు.
సిద్ధాంత్ నటనతో పాటు కవిత్వం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు కవితలు రాస్తుంటాడు. అలాగే తనకు నచ్చిన ఓ అమ్మాయికి కవిత రాసి ఇవ్వగా, ఆమె దాన్ని విసిరేసింది. సాధారణంగా ఏ అమ్మాయి అయినా తనపై కవిత రాస్తే మురిసిపోతుంది కానీ ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసిందా అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు కథ ఉంది. సిద్ధాంత్ ఆ అమ్మాయికి ఓ ప్రసిద్ధ కవి రాసిన కవితను కాపీ కొట్టి, తాను రాశానని చెప్పి ఇచ్చాడు. కానీ ఆ అమ్మాయి ఆ విషయాన్ని గ్రహించి కోపంతో కవితను విసిరేసిందని గుర్తు చేసుకున్నాడు.
" ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. అందుకే మొదటి సారి ఓ కవిత రాసి తనకు ఇచ్చా. ఆమె దాన్ని చదివి ఇది విలియం వర్డ్స్ వర్త్ రాసిన డా ఫోడిల్స్(ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఏ క్లౌడ్)లోనిది కదా అని ప్రశ్నించింది. తర్వాత ఆ కవితను విసిరేసింది. అదే నేను ఇచ్చిన మొదటి లేఖ"
-- సిద్ధాంత్ చతుర్వేది, బాలీవుడ్ నటుడు
గతేడాది వచ్చిన 'గల్లీబాయ్'లో ఎమ్సీ షేర్‌గా కనిపించి అలరించాడు సిద్ధాంత్. ఇందులోని ఇతడి నటనకుగానూ ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం 'బంటీ ఔర్ బాబ్లీ 2' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రాణి ముఖర్జీ, సైఫ్ అలీఖాన్, శార్వారీ వాగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటే దీపికా పదుకొణె, అనన్య పాండేలతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నాడు.
చేతి నిండా సినిమాలు
చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని చెప్పాడు సిద్ధాంత్. ఒకప్పుడు అవకాశాలు లేక ఖాళీగా తిరిగిన తాను, ఇప్పుడు అస్సలు తీరిక లేకుండా గడుపుతున్నానని అన్నాడు.
ఇదీ చదవండి: ఫ్యాషన్ రంగంలో దూసుకెళ్తున్న ట్రాన్స్ మోడల్స్