Shyam Singha Roy: "స్క్రీన్‌ప్లే పరంగా.. విజువల్ పరంగా చాలా కొత్తగా ఉండే సినిమా 'శ్యామ్ సింగరాయ్'. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని అందిస్తుంది" అన్నారు రాహుల్ సంకృత్యాన్. 'టాక్సీవాలా' చిత్రంతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు నాని హీరోగా 'శ్యామ్ సింగరాయ్' సినిమాని తెరకెక్కించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు రాహుల్.
"కథలో ఉన్న బంగాల్ నేపథ్యమే నన్నీ సినిమా చేయడానికి ప్రేరేపించింది. కథలో పాత్రలన్నీ చాలా బాగా కుదిరాయి. స్క్రిప్ట్‌పై ఇంకాస్త వర్క్ చేస్తే అందరూ మెచ్చేలా తీయొచ్చనిపించింది. అందుకే లాక్‌డౌన్ మొత్తం స్క్రిప్ట్‌పైనే పని చేసి.. ఇంకా బెటర్‌గా తీర్చిదిద్దాం. కథ పూర్తిగా సిద్ధమయ్యాక నేరుగా నాని దగ్గరకే వెళ్లి వివరించి చెప్పాను. మరో ఆఫ్షన్ కూడా అనుకోలేదు. ఎందుకంటే సినిమాలో నాని పాత్రలో ఉన్న షేడ్స్‌ను ఆయన మాత్రమే చేయగలరు. అందుకే ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవర్నీ ఊహించుకోలేకపోయా. నాని ప్రోత్సాహం వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలిగా. ఈ స్క్రిప్ట్ అనుకున్న రోజే 'శ్యామ్ సింగరాయ్' అనే టైటిలనుకున్నాం."
అందుకే దేవదాసి వ్యవస్థను టచ్ చేశాం..
"నాని ఈ చిత్రంలో వాసు, శ్యామ్ సింగరాయ్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఓ పాత్ర కథ వర్తమానంలో సాగుతుంటే.. మరో కథ 1970ల కాలం నాటి బంగాల్ నేపథ్యంలో సాగుతుంది. అందరూ అనుకున్నట్లు ఈ సినిమాలో దేవదాసి వ్యవస్థ అనేది మెయిన్ సబ్జెక్ట్ కాదు. కథలో ఓ నాయిక క్యారెక్టర్ కోసం తీసుకున్నదే. దానికి వ్యతిరేకంగానే హీరో పోరాడతాడు. కథ ప్రకారం ఈ దేవదాసి వ్యవస్థ అనే పాయింట్ బంగాల్లో మొదలైనా.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు.. ఇలా పాన్ ఇండియా స్థాయిలో చర్చిస్తాం."
క్లైమాక్స్ సవాల్‌గా అనిపించింది..
"నాని కథ వినగానే ఇందులో ఓ నాయిక పాత్రను సాయిపల్లవి చేస్తేనే బాగుంటుందన్నారు. ఆమె మంచి డ్యాన్సర్. ఈ సినిమా కోసం క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఈ చిత్ర విషయంలో క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరణ నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. అదెందుకు అన్నది సినిమా విడుదలయ్యాక మీకే తెలుస్తుంది."
టైమ్ ట్రావెల్ కథతో
"ప్రతి సినిమా విభిన్నంగానే తీయాలని ప్రణాళికతో ఏమీ రాలేదు. అనుకోకుండా అన్నీ అలా కుదిరాయి. రోటీన్ డ్రామాలు కాకుండా.. అందులో నుంచి బయటకొచ్చి ఏదన్నా కొత్తగా చెప్పాలనిపిస్తుంది. ప్రస్తుతం టైమ్ ట్రావెల్ జానర్‌లో ఓ కథ రెడీగా ఉంది. ఇప్పుడు దానిపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను."
ఆలస్యం అందుకే..
"నా తొలి సినిమా 'ది ఎండ్' తర్వాత నేను రకరకాల కథలు రెడీ చేసుకున్నాను. వాటిలో ప్రతిదీ చాలా వెరైటీగా ఉంటుంది. కొన్ని కథలు చెప్పినప్పుడు.. నిర్మాతలు విని భయపడ్డారు. అలా తర్వాతి సినిమా చేయడానికి చాలా ఆలస్యమైంది. అదే సమయంలో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని ఓలాలో పెట్టుకుందామనుకున్నా. అప్పుడే 'టాక్సీవాలా' కథాంశం వచ్చింది. అది మంచి విజయాన్ని అందుకున్నా.. ఆ తర్వాతా అనుకోకుండా గ్యాప్ వచ్చింది. కొన్ని కథలు అనుకున్నా.. ఏదీ వర్కవుటవ్వలేదు. అదే సమయంలో సత్యదేవ్ జంగా దగ్గర ఈ కథ తీసుకుని సినిమా చేశా."
ఇవీ చూడండి:
స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి
Shyam Singha Roy: ''శ్యామ్ సింగరాయ్'.. వాటి కోసం మూడేళ్లు కష్టపడ్డాం'