ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయని నటి శ్రుతిహాసన్ చెప్పింది. ప్రస్తుతం వృత్తి పరమైన జీవితంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నానని కాబట్టి అందరూ దాని గురించే మాట్లాడితే బాగుంటుందని స్పష్టం చేసింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'క్రాక్'తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో వకీల్‌సాబ్, సలార్, పిట్టకథలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
'సలార్' షూట్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్.. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించింది. 'ప్రస్తుతం 'సలార్' షూట్‌లో బిజీగా ఉన్నాను. ఇప్పటి వరకూ నేను పోషించిన పాత్రలతో పోలిస్తే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉండనుంది. 'సలార్' గురించి ఇప్పుడే ఏం విప్పలేను. మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. మంచి మనస్సున్న, వృత్తిపట్ల పూర్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన' అని శ్రుతి వెల్లడించింది.
గత కొన్నిరోజుల నుంచి ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శ్రుతి ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. సదరు వార్తలపై ఆమె స్పందిస్తూ.. 'వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం పనిమీదనే. కాబట్టి ఎదుటివారు కూడా నా వర్క్‌పైనే ఫోకస్ చేస్తే బాగుంటుంది' అని ఆమె వివరించారు.
ఇది చదవండి: నాలాంటి భార్యే కావాలట: శ్రుతి హాసన్