'మా అమ్మాయితో మాట్లాడుతున్నపుడు ‘అబ్బాయిలకి మ్యాథ్స్ ఇష్టం. అమ్మాయిలకి లాంగ్వేజెస్ ఇష్టం' అని చెప్పింది. అప్పుడు తనకు ఏడేళ్లు ఉంటాయేమో. సైన్స్/గణితంపైన ఇష్టం పెరగడానికి ఆ రంగంలో విజయవంతమైన ఓ భారతీయ మహిళ కథని సినిమా రూపంలో ఈ తరానికి చెప్పాలని అప్పుడే అనుకున్నా. ఆ వెంటనే మానవ కంప్యూటర్‌గా పిలిచే ‘శకుంతలా దేవి’ గుర్తొచ్చారు. ఆమె మీద పరిశోధన మొదలుపెట్టా. నేను లండన్‌లో ఉంటాను. వాళ్ల అమ్మాయి అనుపమ బెనర్జీ కూడా అక్కడే ఉంటుంది. దాదాపు మూడేళ్లపాటు ఆమె నుంచి చాలా విషయాలు సేకరించి కథ సిద్ధం చేశా. శకుంతల ఆమె తరానికంటే ముందుండి ఆలోచించారు. జీవితంలో ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్నారు. ఈ సినిమాలో గణిత మేధావిగా, మహిళగా, అమ్మగా శకుంతలను చూపించాను.
శకుంతల పాత్రని విద్యాబాలన్ మాత్రమే చేయగలరనిపించి స్క్రిప్టు రాయకముందే ఆమెని కలిశా. చాలారోజులు ఆలోచించాకే చేస్తానన్నారు. శకుంతల అంకెలతో ఆడుకునేవారు. మేం కూడా అది సహజంగా చూపించాలనుకున్నాం. విద్య తన డైలాగుల్లో చాలా పెద్ద నంబర్లు, గణిత సూత్రాలు చెప్పాల్సి ఉంటుంది. అందుకే కొన్నిరోజులు ఆమెకు మ్యాథ్స్ నేర్పించడంతో ఆ సూత్రాల్ని అర్థం చేసుకుని డైలాగులు చెప్పారు. విద్య ఈ పాత్రని బాగా ఆస్వాదించారు. ఇంజినీర్ అయిన నేనూ మ్యాథ్స్, అంకెలమీద పరిశోధనని ఎంతో ఎంజాయ్ చేశాను. స్ఫూర్తిదాయక, వినోదాత్మక కథతో సినిమా తీశాం. అమ్మాయిలు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్ని ఇష్టంగా చదివేలా మార్పు తెస్తుందీ సినిమా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో ప్రజలకు స్ఫూర్తినిచ్చే అంశాలు కావాలి. అవి కచ్చితంగా ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే థియేటర్‌లో రిలీజ్ అవ్వకపోయినా తగిన సమయంలో రిలీజైనందుకు ఆనందంగా ఉంది.
సినిమాల్లోకి ఎందుకంటే...
నేను పుట్టి పెరిగింది దిల్లీలో. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చేశాను. కానీ నాకు సృజనాత్మక రంగంలో అడుగు పెట్టాలని ఉండేది. అందుకే ఇంట్లో వద్దన్నా అడ్వర్టైజింగ్ విభాగంలోకి అడుగుపెట్టాను. బెంగళూరు, సింగపూర్‌లలో స్ట్రాటజిక్ బ్రాండ్ ప్లానర్‌గా పనిచేశాను. సింగపూర్‌లో ఉంటూ వియత్నాం, మయన్మార్, చైనా... దాదాపు ఆసియా దేశాలన్నీ చుట్టొచ్ఛా అప్పుడే నేను చూసిన ప్రపంచాన్నీ, నా ఆలోచనల్నీ సినిమాల ద్వారా చెప్పాలనుకున్నా. ఉద్యోగానికి బై చెప్పేసి లండన్ ఫిల్మ్ స్కూల్లో మూడేళ్ల డైరెక్షన్ కోర్సు చేశా. దిల్లీలో పెరగడంతో హిందీ మీద మంచి పట్టు ఉంది. కాబట్టి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టా. స్క్రిప్టు పట్టుకుని మొదటిసారి ముంబయి రావడం నాకింకా గుర్తు... అప్పుడు ఆరు నెలల ప్రెగ్నెంట్‌ని. నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్ని. 2012లో వచ్చిన 'లండన్ ప్యారిస్ న్యూయార్క్' నా మొదటి సినిమా. ఆ తర్వాత 'వెయిటింగ్' తీశా. 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్'...’ వెబ్‌సిరీస్ మొదటి సీజన్‌కి దర్వకత్వం వహించాను. ఆ కాన్సెప్ట్‌ని నిర్మాత రంగిత చెప్పారు. బాగా నచ్చి చేశాను. ఇరవైల్లో ఉన్న నలుగురు మహిళా స్నేహితుల కథ అది. దానికీ మంచి గుర్తింపు వచ్చింది.
స్త్రీ కోణాన్ని సినిమా ద్వారా చూపించాలంటే మహిళా దర్శకులు ముందుకు రావాలి. సినిమా తీయడమనేది అంత సులభమైన పని కాదు, ఇక్కడ ఎదురయ్యే సవాళ్లకు సిద్ధమైతేనే రావాలి. నేను ఇక్కడ ఉన్నందుకు గర్వంగా ఫీలవుతాను. నా స్ఫూర్తితో కొద్దిమంది మహిళలైనా దర్శకులుగా మారితే చాలా సంతోషిస్తా!