"సినిమాల్లో నటించాలని, స్టార్ కావాలని షకీలా ఎప్పుడూ అనుకోలేదు. డబ్బు కోసం మాత్రమే ఆమె సినిమాల్లో నటించారు" అని బాలీవుడ్ నటి రిచా చద్దా అన్నారు. చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళి నటి షకీలా జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం 'షకీలా'. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిచా చద్దా టైటిల్ రోల్ పోషించారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను సొంతం చేసుకుంది. త్వరలో 'షకీలా' చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
కాగా, తాజాగా 'షకీలా' సినిమా గురించి నటి రిచా చద్దా స్పందించారు. "మనదేశంలో ఉన్న ప్రతిఒక్కరికీ అందం విషయంలో విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అలాగే నటి షకీలాకి కూడా. ఆమెలా కనిపించాలనే ఉద్దేశంలో ఈ సినిమా కోసం నేను కొంచెం బరువు పెరగాల్సి వచ్చింది" అని రిచా తెలిపారు.
ఈ సినిమాతో షకీలా గురించి ఏం తెలుసుకున్నారు అని ప్రశ్నించగా.. "షకీలాకు అడల్ట్ చిత్రాల్లో నటించాలనే ఆలోచన లేనప్పటికీ డబ్బుల కోసం మాత్రమే అలాంటి సినిమాలు చేశారు. వాళ్లమ్మ ఓ జూనియర్ ఆర్టిస్ట్. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా షకీలాను నటిగా మారమని బలవంతం చేశారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు" అని రిచా పేర్కొన్నారు.