Shahrukh on his love Story: ప్రేమ.. పెళ్లి.. ఈ రెండింటి మధ్య ప్రతి రోజూ జరిగేది.. గుర్తుండిపోయే ప్రయాణమే. నవ్వులు, గిలిగింతలు, కొట్లాటలు, అలకలు, కోపాలు, తాపాలు, బెదిరింపులు, త్యాగాలు అన్నీ ఉంటాయి. మరి బాలీవుడ్ బాద్‌షా జీవితంలో మాత్రం పెళ్లి అంటే ఓ ప్రయాణం కాదు.. పోరాటమనే చెబుతాడట. ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ వివాహం గురించి ఇలా చెప్పుకొచ్చాడు షారుక్.
"నేను స్కూల్‌కు వెళ్లే రోజుల నుంచి గౌరీ నాకు పరిచయం. మంచి స్నేహితులుగా ఉన్న మేము పెద్దయ్యాక ఒకరి మీద ఒకరికి ఉన్నది స్నేహం కాదు. ప్రేమ అని తెలుసుకున్నాక ప్రేమని వ్యక్తపరుచుకున్నాం. ఇక పెళ్లి చేసుకుందాం అనేసరికి అసలు సినిమా మొదలైంది. బాలీవుడ్ చిత్రాల్లో చూపించినట్లే మా లవ్‌స్టోరీలోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. మొదట్లో మా ఇద్దరి రిలేషన్‌షిప్‌కి గౌరీ వాళ్ల కుటుంబం వ్యతిరేకత చూపించారు. మా ప్రేమ సంగతి తెలుసుకున్న గౌరీ అన్నయ్య విక్రాంత్ అయితే ఏకంగా నా చెల్లినే ప్రేమిస్తావా అంటూ గన్‌తో బెదిరించాడు. గౌరీ హిందూ, నేను ముస్లిం.. ఇద్దరివి వేర్వేరు మతాలు కావడం వల్ల పెళ్లి చేసుకునేందుకు పెద్దలను ఒప్పించే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాం. గౌరీ తండ్రి రమేష్ చిబ్బర్ నా నటనపై అభ్యంతరాలు లేవనెత్తారు. గౌరీ తల్లి సవిత.. ఇద్దరూ విడిపోవడానికి జ్యోతిష్యుడిని కూడా సంప్రదించింది. ఓ గుండాగా చెప్పుకొనే గౌరీ అన్నయ్య విక్రాంత్.. నాపై గన్ పెట్టి చంపేస్తామని బెదించారు. చుట్టూ అలా ఎన్నో బెదిరింపులు వచ్చాయి. అయినా బెదరలేదు. 1991 అక్టోబర్ 25న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాం."
పారిస్ అని అబద్ధం చెప్పి డార్జిలింగ్ తీసుకెళ్లా..
"నా పెళ్లప్పటికీ నేను చాలా పేదరికంలో ఉన్నా. గౌరీ ఏమో మధ్యతరగతినుంచి వచ్చిన అమ్మాయి. గౌరీకి పెళ్లాయ్యాక నేనో మాటిచ్చా. అదేంటే.. పారిస్‌కు తీసుకెళ్లి ఐఫిల్ టవర్ చూపిస్తానని. కాని అప్పుడు నేను చెప్పిందంతా అబద్ధమే ఎందుకంటే విమాన టికెట్ బుక్ చేసేందుకు కూడా నా దగ్గర డబ్బు లేదు. ఇక నా మూడో చిత్రం 'రాజు బన్ గయా జెంటిల్ మేన్' చిత్రంలో ఓ సాంగ్ షూటింగ్ కోసం డార్జిలింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఓరోజు గౌరీ ఫోన్‌చేసి పద, పారిస్‌కి వెళ్తున్నాం రెడీ అవ్వు అని చెప్పి డార్జిలింగ్‌కి తీసుకెళ్లా"
ఓ పక్క వ్యక్తిగతంగా సవాళ్లు, బెదిరింపులు ఎదుర్కొన్న షారుక్.. కెరీర్‌ని ప్రారంభించిన కొత్తలోనూ ఎన్నో కష్టాలు చవిచూశాడు. సినిమా రంగంలో అడుగుపెట్టడానికి ముంబయి వచ్చిన రోజుల్లో చేతిలో పైసాలేక.. కడుపు మాడ్చుకొని ఉన్నారు. నిద్రపోవాలంటే హోటల్ బయటనే. ఓ పక్క సినిమా ఛాన్స్‌లు వెతుక్కుంటూనే మరో పక్క హోటల్లోని వాష్‌రూమ్స్ శుభ్రం చేసేవాడట. అద్దె చెల్లించాలంటే చేతిలో డబ్బు కూడా లేక ఇంటి ఓనరు సామాన్లతో సహా రోడ్డు మీదకు నెట్టేశారట. కష్టాలే జీవితాన్ని ప్రారంభించేలా చేశాయని. వాటిని తలుచుకునేందుకు ఏమాత్రం బాధపడనని చెబుతాడు షారుక్.