"కొన్నేళ్లుగా కథలను సరిగ్గా చెప్పడంలో నేను విఫలమవుతున్నా. ఫలితంగానే వరుస పరాజయాలను ఎదుర్కోవల్సి వస్తోంది. నేనిది ఎంతో నిజాయతీగా అంగీకరిస్తున్న, చెప్తున్న మాట" అంటున్నాడు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్. 2013లో 'చెన్నై ఎక్స్‌ప్రెస్'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాక ఇంతవరకు బాద్షా ఆ స్థాయిలో మరో హిట్‌ను దక్కించుకోలేక పోయాడు. ఈ క్రమంలో అరడజనుకు పైగా ఫ్లాప్‌లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక గతేడాది ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జీరో' షారుఖ్‌కి దిమ్మతిరిగిపోయే షాకే ఇచ్చింది. ఈ చిత్ర ఫలితంతో పునరాలోచనలో పడ్డ ఈ హీరో ప్రస్తుతం కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
తాజాగా షారుఖ్ తన సినీ కెరీర్‌లో ఎదురవుతున్న వైఫల్యాలకు సంబంధించి ఓ ఆంగ్లమీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "కథలను అన్నిసార్లు గొప్పగా చెప్పడం సాధ్యపడదు. కాబట్టి పరాజయాలు ఎదుర్కోవల్సి వస్తుంది. భారత్‌లో సినిమాలు తీయడం, క్రికెట్ ఆడటం అందరికీ బాగా తెలుసు. వాళ్లు సచిన్‌కు బ్యాటింగ్ ఎలా నేర్పుతారో.. నాకు కథ చెప్పడం అలాగే నేర్పుతుంటారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా.. మంచి చిత్రాలు తీయలేదు. ఫలితంగా అవి ఫ్లాప్ అయ్యాయి. నిజాయతీగా చెప్తున్న మాటిది. ప్రేక్షకులే నాకు బాస్. నేను వాళ్ల ఉద్యోగిని. వాళ్లని సంతృప్తి పరచలేనప్పుడు నా ఉద్యోగం ఊడిపోతుందని నాకు తెలుసు. రెండేళ్లుగా నేనిదే పరిస్థితిని ఎదుర్కొంటున్నా. కానీ, నేను మళ్లీ వస్తా. నా బాస్‌ను మచ్చిక చేసుకుంటా. వాళ్ల మెప్పు పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా" అని చెప్పుకొచ్చాడు.
'జీరో' తర్వాత ఇంతవరకూ షారుఖ్ నుంచి కొత్త చిత్ర ప్రకటనేదీ రాలేదు. అట్లీ దర్శకత్వంలో ఇతడు ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలొచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. మరి కొత్త ఏడాదిలోనైనా ఈ హీరో నుంచి కొత్త కబురు వినిపిస్తుందేమో వేచి చూడాలి. ప్రస్తుతం షారుఖ్ నిర్మాతగా అభిషేక్ బచ్చన్‌తో 'బాబ్ బిస్వాస్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇవీ చూడండి.. 'గల్లీబాయ్'పై మరోసారి కంగనా సోదరి విమర్శలు