బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని మనాలీ చేరుకున్నారు. అనేక వివాదాల మధ్య సెప్టెంబరు 9న ముంబయి వెళ్లిన ఆమె.. సోమవారం తిరిగొచ్చేశారు. నటికి ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 'వై-ప్లస్' కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ భద్రతను తొలగించాలని సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప ట్వీట్ చేశారు. కంగన భద్రతకు అయ్యే ఖర్చును అంచనా వేసి చెప్పారు.
"ఒక్క మనిషికి నెల రోజులపాటు 'వై-ప్లస్' కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంపై రూ.10 లక్షల భారం పడుతుంది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్ని అందుకోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు కంగన హిమాచల్‌ప్రదేశ్‌లో సురక్షితంగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం.. కంగనకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని ఆదేశిస్తుందా?"
- బ్రిజేష్ కలప్ప, సుప్రీంకోర్టు న్యాయవాది
దీనికి కంగన స్పందిస్తూ.. "బ్రిజేష్ గారు.. మీరు, నేను ఊహించుకొని చెప్పేదాన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం భద్రత ఇవ్వదు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అపాయం ఉందా? లేదా? అనే విషయాన్ని విచారిస్తుంది. దాని ఆధారంగా నా సెక్యూరిటీ గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో భద్రతను పూర్తిగా తీసేయొచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో నాకు ప్రమాదం ఉందని తెలిస్తే భద్రతను మరింత పెంచొచ్చు" అని వెల్లడించారు.
ప్రాణాలతో రావడం నా అదృష్టం
కంగన ముంబయి నుంచి చండీగఢ్ చేరుకున్న తర్వాత ట్వీట్ చేసింది. "ఇక్కడి ప్రజలు నాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈసారి బతికి బయటపడ్డ భావన నాకు కల్గింది. ఒకప్పుడు ముంబయిలో నాకు అమ్మ స్పర్శ తెలిసింది. కానీ, ఇవాళ అక్కడి నుంచి ప్రాణాలతో ఇంటికి చేరుకోవడం అదృష్టంగా భావించాల్సి వచ్చింది" అని తెలిపారు.
కంగన గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో.. ఇరువురి మధ్య ఒకస్థాయిలో మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది.