బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు చెందిన భవనాన్ని క్రమబద్ధీకరించే విషయమై నిర్ణయం తీసుకోవాలంటూ బృహన్ మున్సిపల్ కార్పోరేషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ముంబయిలోని తన భవనం విషయమై బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోనూసూద్ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు అనుమతించింది. జుహూలో అక్రమ నిర్మాణం చేపట్టారంటూ సోనూకు బీఎంసీ గతంలో నోటీసులు జారీ చేసింది.
తన నివాసానికి మరమ్మతులే చేశామని, అక్రమ నిర్మాణం చేపట్టలేదని బీఎంసీ నోటీసులను కొట్టేయాలని అభ్యర్థిస్తూ సోనూసూద్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం అందుకు నిరాకరించడం వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. శుక్రవారం దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి హాజరయ్యారు. నిర్మాణ క్రమబద్ధీకరణకు సోనూ దరఖాస్తు చేశారని, బీఎంసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని.. వ్యాజ్యాన్ని వెనక్కు తీసుకునేందుకు అనుమతించాలని అభ్యర్థించారు.