ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు తెలుగులోకి రావడం కొత్తేమీ కాదు. అయితే ఎక్కువగా తమిళ, మలయాళ, హిందీ పరిశ్రమల నుంచి.. మరీ కాకపోతే ఇతర దేశ భాషల నుంచి తీసుకొస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్‌లోకి శాండిల్‌వుడ్ కూడా వచ్చేసింది. 'యూ టర్న్' సినిమా తర్వాత మనవాళ్ల చూపు కన్నడ సీమవైపు వెళ్తోంది. తాజాగా మరో కన్నడ సినిమా టాలీవుడ్‌కి వస్తోంది. ఈ ఏడాది మొదట్లో విడుదలై మంచి విజయం అందుకున్న 'లవ్ మాక్‌టైల్' ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది.
ప్రముఖ కథానాయిక తమన్నా, యువ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై భావన రవి నిర్మాతగా ఈ సినిమా రూపొందనుంది. నాగశేఖర్ దర్శకత్వంలో.. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ మధ్య వారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తుండగా... సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
కన్నడ 'లవ్ మాక్‌టైల్'ను కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించారు. ఇందులో మిలనా నాగరాజ్, అమృత అయ్యంగర్ ఇతర ప్రధాన పాత్రల్లో కనువిందు చేశారు. సుమారు రూ.రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రూ.ఐదు కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఇందులో నటనకుగాను ప్రధాన పాత్రధారులకు మంచి పేరు వచ్చింది. మరి తెలుగులో తమన్నా - సత్యదేవ్ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">