"ఎవ్వరూ చేయనిది చేసే అవకాశం ఒక నటుడి జీవితంలో చాలా తక్కువసార్లే వస్తుంది. అలాంటి అరుదైన అవకాశం నాకు 'ఏక్ మినీ కథ' (ek mini katha) రూపంలో వచ్చింది. మేమే మొదటిగా ఇలాంటి కథని చెప్పగలిగాం అనే సంతృప్తి కలిగింది" అని తెలిపాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.
'గోల్కొండ హైస్కూల్'తో ప్రయాణం మొదలుపెట్టిన సంతోష్ 'తను నేను', 'పేపర్‌బాయ్' తదితర చిత్రాలతో మెరిశాడు. ఇటీవల ఇతడు కథానాయకుడిగా నటించిన 'ఏక్ మినీ కథ' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ 'ఈటీవీ భారత్'తో ముచ్చటించాడు. ఆ విషయాలివీ..
- పదేళ్లుగా నా ప్రయాణం సాగుతోంది. తొలి విజయం రుచి ఎలా ఉంటుందో ఈ సినిమాతోనే తెలిసింది. ఆ విజయం అందించిన ప్రోత్సాహం, దాని తాలూకు అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మనందరి జీవితాల్లో చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అసలు అది సమస్యో కాదో తెలియకుండానే ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సున్నితమైన విషయాల్ని స్పృశించిన కథే ఇది.
- ఎలాంటి అండ లేకపోయినా నా ప్రతిభని నమ్మి అవకాశం ఇచ్చింది యు.వి.క్రియేషన్స్. ఇదే సంస్థలోనే వరుసగా సినిమాలు చేస్తున్నా. వైజయంతీ మూవీస్ సంస్థలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఓ కొత్త దర్శకుడితో సినిమా ఉంటుంది. అలాగే అభిషేక్ మహర్షి అనే నా మిత్రుడి దర్శకత్వంలో, సారంగ ప్రొడక్షన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా.