కరోనా పరిస్థితులతో చిత్రీకరణలు లేక ఇంటికే పరిమితమైన సినీతారలు.. చక్కగా ఇంటి పట్టునే ఉంటూ వివిధ వ్యాపకాలతో సరదాగా గడిపేస్తున్నారు. ఇప్పటికే కొందరు కథానాయికలు పాకశాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని చూపిస్తుంటే.. మరికొందరు బుద్ధిగా ఆన్‌లైన్‌లలో కొత్త కోర్సులు నేర్చుకుంటూ, బొమ్మలు గీస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ, అక్కినేని సమంత మాత్రం ఇలాంటి వాళ్లందరికీ భిన్నంగా ఓ చక్కటి పనిని భుజానికెత్తుకుంది. అదే వ్యవసాయం చేయడం.
ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరణలు లేక ఇంటికే పరిమితమైన సమంత.. తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చుకుంది. అర్బన్ కిసాన్ వారి సహకారంతో మిద్దె వ్యవసాయాన్ని మొదలుపెట్టింది. దీనికోసం మిద్దెపైనున్న ఖాళీ ప్రదేశంలో చిన్నపాటి స్టాండ్స్ ఏర్పాటు చేసుకుని వాటిలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.