కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైరస్‌పై సమష్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు సినీ ప్రముఖులు. తాజాగా నటుడు సాయి కుమార్ ప్రజలందరికీ ఓ సందేశాన్నిచ్చాడు.
"అందరికీ నమస్కారం.. ఇది మన సంస్కారం. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహామే మీరు.. మీరు అంటే మనం.. మనం అంటే దేశం.. దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశం మనకేం చేసిందానే కంటే దేశానికి మనం ఏం చేశామన్నదే ముఖ్యం. ఈ రోజు మనం గొప్ప సేవ చేయాల్సిన అక్కర్లేదు. మన ఇళ్లలో మనం కూర్చుంటే చాలు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటిస్తూ.. స్వీయ నియంత్రణతో శుభ్రతతో క్రమశిక్షణతో మీ తల్లిదండ్రులతో మీ భార్యా పిల్లలతో మీ కుటుంబాలతో మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చాలు." అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పాడు సాయి కుమార్.
ఇప్పటికే చాలా మంది సినీ తారలు కరోనాపై పోరాటంలో తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ సహాయ నిధులకు విరాళాలు ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ప్రజలకు సూచనలు చేస్తున్నారు.