"వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు" అని అంటున్నారు తాప్సీ, భూమి ఫెడ్నేకర్. వీరిద్దరూ 60 ఏళ్ల వయసున్న షూటర్లులగా నటించిన చిత్రం 'సాంద్ కి ఆంఖ్.' ఈ సినిమా టీజర్ ఆసక్తి పెంచుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంద్రూ తోమర్, ప్రకాశీ తోమర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వీరిని 'షూటర్ దాదీస్' అని ముద్దుగా పిలుస్తుంటారు.
సినిమా కథ ఇదే...
ఉత్తరప్రదేశ్‌లోని జోహ్రి గ్రామానికి చెందిన చంద్రూ తోమర్, ప్రకాశీ తోమర్ అక్కాచెల్లెళ్లు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరగడం వల్ల కుటుంబం కోసమే తమ జీవితాన్ని వెచ్చించారు. తమ కుమార్తెల జీవితాలు అలా కాకూడదని భావించి 50 ఏళ్ల వయసులో తుపాకీ చేతపట్టారు. కూతుర్ల చదువులను అడ్డుకోవాలని చూసేవాళ్లని తుపాకీలతో బెదిరిస్తారు. ఈ నేపథ్యంలో లక్ష్యం తప్పకుండా దేన్నైనా కొట్టగలిగే సామర్ధ్యం తమలో ఉందని వారికి తెలుస్తుంది. అలా వారు జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌లో పాల్గొని దాదాపు 300కు పైగా పతకాలు సాధించారు.
ఈ బయోపిక్‌లో నటించడానికి ముందు చంద్రూ, ప్రకాశీల స్వస్థలమైన బాగ్‌పట్ జిల్లాకు వెళ్లి కొన్ని రోజులు వారి ఇంట్లోనే ఉన్నారు తాప్సీ, భూమి. చిత్రీకరణ మొత్తం ఆ ప్రాంతంలోనే జరిగింది. ఈ చిత్రానికి తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ నిర్మాత. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: అన్నాచెల్లెళ్లుగా కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్!