RRR Movie Techincal Team: 'ఆర్ఆర్ఆర్' కోసం నాలుగేళ్లు శ్రమపడ్డ రాజమౌళి బృందం.. ఎన్నో వ్యయప్రయాసలకొర్చి అద్భుతంగా చిత్రాన్ని మలిచింది. వాస్తవానికి 240 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేద్దామని భావించిన రాజమౌళికి కాల పరీక్ష ఎదురైంది. అనుకున్న సమయానికంటే 60 రోజులు ఎక్కువే తీసుకున్న జక్కన్న 300 రోజుల్లో 'ఆర్ఆర్ఆర్'ను పూర్తి చేశారు. ఎంతో మంది సినీ అభిమానులు వేచి చూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్' భారీ అంచనాలు నడుమ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలు నటించగా.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ప్రేక్షకులతోపాటు చిత్ర పరిశ్రమల వర్గాల దృష్టిని ఆకర్షించిన ఈ క్రేజీ ప్రాజెక్టు 'తెర వెనుక' హీరోల గురించి తెలుసుకుందామా..!
ఈయనతోనే మొదలు.. ఈ చిత్రానికి ఆద్యుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. ఎందుకంటే 'ఆర్‌ఆర్‌ఆర్' కథ ఆయనదే. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఓ ఆసక్తికర పాయింట్ రాజమౌళికి బాగా నచ్చింది. పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయమని, తాను స్క్రీన్‌ప్లే అందించారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలకు తగ్గట్టు చరణ్, తారక్‌లను ఎంపిక చేశారు. అలా విజయేంద్ర ప్రసాద్ ఆలోచన దృశ్యరూపంలోకి వచ్చింది. 'స్టూడెంట్ నం.1', 'మర్యాద రామన్న', 'ఈగ' మినహా రాజమౌళి చిత్రాలన్నింటికీ విజయేంద్ర ప్రసాదే కథ అందించారు.
పదునైన మాటలు.. ప్రేక్షకులపై సినిమా కథల ప్రభావం ఎంత ఉంటుందో పంచ్ డైలాగ్స్‌ల ప్రభావం అంతకుమించి ఉంటుంది. మల్టీస్టారర్ అంటే అది ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమాకు కథకు తగ్గ పదునైన మాటల్ని సాయిమాధవ్ బుర్రా (తెలుగులో) అందించగా.. హిందీ వెర్షన్: రియా ముఖర్జీ, తమిళం: కర్కి, కన్నడ: వరదరాజు, మలయాళంలో గోపాల కృష్ణన్ రాశారు.
సవాల్ స్వీకరించిన ఛాయాగ్రాహకుడు రాజమౌళి కలను 'కెమెరా కళ్ల'తో చూసే వ్యక్తి సెంథిల్ కుమార్. 'సై' సినిమా నుంచి వీరి ప్రయాణం కొనసాగుతోంది. ఈ కాంబినేషన్‌లో 'ఛత్రపతి', 'యమదొంగ', 'మగధీర', 'ఈగ', 'బాహుబలి' చిత్రాలొచ్చాయి. అయితే, ఇద్దరు అగ్ర హీరోలతో ఒకేసారి కలిసి పనిచేయడం ఆయనకు కొత్త. దాంతో ఎవరిపై ఎక్కువ దృష్టి పెట్టాలో తెలియక ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డారట. 'బాహుబలి' విజువల్ గ్రాండియర్ సినిమా. 'ఆర్‌ఆర్‌ఆర్' భావోద్వేగాలతో కూడిన ఓ యాక్షన్ డ్రామా. భావోద్వేగాల పరంగా లోటుపాట్లు లేకుండా.. విజువల్‌గా ఎంత ప్రభావం చూపించగలమనేది ఈ చిత్ర విషయంలో మాకెదురైన మరో అతి పెద్ద సవాల్' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఛాయాగ్రాహకుడు సెంథిల్.
జీవకళ ఉట్టిపడే సెట్స్.. వర్తమాన కాలంలో సాగే కథలకు సెట్స్ వేయడంతో పోలిస్తే పీరియాడికల్ కథలకు సెట్స్ రూపొందించడం చాలా కష్టం. అప్పట్లో ధరించే దుస్తుల దగ్గర నుంచి వాడే వస్తువుల వరకూ అన్నింటి గురించి రీసెర్చ్ చేయాలి. అందుకనుగుణంగా సెట్టింగులు వేయాలి. 1920ల నాటి ఈ కథకు జీవకళ ఉట్టిపడే సెట్స్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌ను ఎంపిక చేసుకున్నారు రాజమౌళి. 'బాహుబలి' తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేసిన చిత్రమిది.
కీరవాణి రాగాలు.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే వాటిల్లో సంగీతం ముందుంటుంది. పాటలతో పాటు సన్నివేశానికి తగ్గ నేపథ్య సంగీతం వినిపిస్తేనే ప్రేక్షకులకు మజా వస్తుంది. 'ఆర్‌ఆర్‌ఆర్' సహా రాజమౌళి చిత్రాలన్నింటికీ ఆయన సోదరుడు ఎం. ఎం. కీరవాణినే సంగీత దర్శకుడిగా పనిచేశారు. 'ది బెస్ట్ కాంబినేషన్' అనిపించుకున్నారు.
గేయ రచయితలు.. గాయకులు ఈ సినిమాలోని తెలుగు పాటలను చంద్రబోస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కీరవాణి, సుద్దాల అశోక్‌తేజ, కె. శివ దత్త రచించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కీరవాణి, విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారికా నారాయణ్, హేమచంద్ర, విజయ్ ప్రకాశ్, చందన బాలకల్యాణ్, చారు హరిహరన్ ఆలపించారు.
ఈయన కట్ చేస్తే.. 'సినిమా రూపొందేది రెండు టేబుల్స్‌పైన. ఒకటి రచయిత టేబులైతే మరొకటి ఎడిటింగ్ టేబుల్' అనేది సినీ పండితుల మాట. సినిమాకి రచన ఎంత ముఖ్యమో ఎడిటింగ్ (కూర్పు) అంతే ముఖ్యం. దర్శకుడు చాలా చెప్పాలనుకుంటాడు. కానీ, ప్రేక్షకులకు ఎప్పుడు, ఎంత చెప్పాలన్నది ఎడిటర్ నిర్ణయిస్తాడు. సినిమా విజయంలో కీలక బాధ్యత పోషిస్తాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' విషయంలో ఆ బాధ్యతను అక్కినేని శ్రీకర్ ప్రసాద్ తీసుకున్నారు.
వీఎఫ్‌ఎక్స్.. సౌండ్ డిజైన్ ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్) బాధ్యతలు వి. శ్రీనివాస మోహన్ తీసుకోగా రఘునాథ్ సౌండ్ డిజైన్ చేశారు. బొలోయ్ కుమార్, రాహుల్ కర్పె రీ- రికార్డింగ్ మిక్స్ చేశారు. ఈ సినిమాకి కలరిస్ట్: శివకుమార్ బీవీఆర్. సుమారు 80 శాతం పోరాటాల చిత్రీకరణ స్టంట్ కొరియోగ్రాఫర్ సాల్మన్ ఆధ్వర్యంలో జరిగింది.
వీరు ఇలా.. నటీనటుల పారితోషికాలు, మార్కెటింగ్, ప్రచార బాధ్యతలు రాజమౌళి తనయుడు కార్తికేయ (లైన్ ప్రొడ్యూసర్); ఏ రోజు ఏ సీన్ షూట్ చేయాలి, నిర్మాణాంతర కార్యక్రమాలు సహా విడుదలకు సంబంధించిన వ్యవహారాలు రాజమౌళి వదిన (పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్), కీరవాణి సతీమణి శ్రీవల్లి చూసుకున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాజమౌళి సతీమణి రమ పనిచేశారు.
సుమారు రూ. 500 కోట్లు వెచ్చించి.. బడ్జెట్ విషయంలో వెనకడుగేయకుండా పాన్ ఇండియా చిత్రం రూపొందించాలనే తన కలను 'ఆర్‌ఆర్‌ఆర్'తో నెరవేర్చుకున్న నిర్మాత డీవీవీ దానయ్య. సుమారు రూ. 500 కోట్లు వెచ్చించి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచనున్నారు.
ది కెప్టెన్.. ఈ అన్ని విభాగాల బాధ్యతను తన భుజాలపై వేసుకునే వారు దర్శకులు. కథ ఓకే అయిన దగ్గర నుంచి తెరపై ‘బొమ్మ’ పడే వరకూ అన్ని విషయాలకు సారథ్యం వహిస్తారు. అలా.. 'ఆర్‌ఆర్‌ఆర్' కెప్టెన్ రాజమౌళి తన సాంకేతిక బృందంతో ఓ అద్భుతం సృష్టించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'.. ఈ నాలుగు పాత్రలు చాలా కీలకం!