Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఆయన ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' విశేషాలతోపాటు తనకిష్టమైన ఆహార పదార్థాల గురించి ముచ్చటించారు. అనంతరం మెగా ఫ్యామిలీలో ఇష్టమైన ఐటమ్‌గా చెప్పుకొనే 'చిరుదోశ'పై సరదాగా మాట్లాడారు.
"స్వీట్స్ కంటే కారంగా ఉండేవే నాకు ఇష్టం. మా ఇంట్లో ఎక్కువగా స్పైసీవి తినేది నేనే. అయితే అన్నింటినీ ఎంజాయ్ చేస్తాను.. కానీ, భోజనప్రియుడిని కాదు. మాంసాహారం కంటే శాకాహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టం. సమయం దొరికినప్పుడు సరదాగా వంటింట్లో గరిటె తిప్పుతా.. అయితే, నాకు వంట చేయడం అంతగా రాదు. మా ఇంట్లో ఫేమస్‌గా చెప్పుకొనే 'చిరుదోశ' తయారీలో ఏయే పదార్థాలు ఉపయోగిస్తారో మా అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. ఇక నాకు మొక్కజొన్న అంటే ఇష్టం ఉండదు. నేను తినే వంటల్లో అది ఉండకుండా చూసుకుంటా"
-రామ్ చరణ్, నటుడు
అనంతరం తన తాతయ్య స్వాతంత్య్ర సమరయోధుడని చరణ్ తెలిపారు. "మా అమ్మ వాళ్ల నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్య్ర సమరయోధుడనే విషయం చాలా తక్కువమందికే తెలుసు. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారు. అందుకు 15 రోజులకుపైగా ఆయన్ని జైలులో పెట్టారు. ఈ విషయం మా కుటుంబసభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు" అని చరణ్ వివరించారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్‌చరణ్, అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో సినిమాను నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇదీ చూడండి: నా జీవితాన్ని ఇంతలా మార్చింది రాజమౌళినే: ఎన్టీఆర్