సాగు చట్టాలు రైతుల పాలిట వరాలు కాదు.. శాపాలు అని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత ఆర్.నారాయణమూర్తి(R.Narayana Murthy) అన్నారు. తక్షణమే సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయమంటే దండగ కాదు.. పండగ అనే విషయాన్ని చాటిచెప్పేలా తీసిన రైతన్న సినిమా గురించి మాట్లాడారు.
ఆయన కథానాయకుడిగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రైతన్న'లో సాగు చట్టాల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు, రైతుల బలవన్మరణాలు, గిట్టుబాటు ధర వంటి అనేక అంశాలు ప్రస్తావించినట్లు నారాయణమూర్తి(R.Narayana Murthy) తెలిపారు. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల అమలుపైనా సినిమాలో చర్చించినట్లు వెల్లడించారు.
"ఇప్పటికే విద్యా, వైద్యం, రైల్వే, ఎల్ఐసీ.. అన్నీ ప్రైవేటుపరం అవుతున్నాయి. ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. సాగు చట్టాలతో రైతులకు నష్టమే గానీ.. లాభం చేకూరదు. స్వామి నాథన్ కమిటీ సిఫారసుల అమలుతో కర్షకులను న్యాయం జరుగుతుంది. కరోనా కష్టకాలంలోనూ... అన్నదాతలు చెమటోడ్చి కష్టపడ్డారు. అటువంటి అన్నదాతల రుణం తీర్చుకోవాలంటే.. సాగు చట్టాలు రద్దు చేయాల్సిందే. సాగు చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాలు కూడా రద్దు చేయాలి. ఈ అంశాలను ప్రధానంగా తీసుకునే రైతన్న సినిమా చేశాం. ఇది పూర్తిగా రైతు కష్టాలు, వారికి జరుగుతున్న అన్యాయం.. వాటిపై కర్షకుల పోరాటాలకు సంబంధించిన సినిమా."
- ఆర్.నారాయణమూర్తి, రైతన్న సినిమా నిర్మాత, నటుడు
దేశంలో.. గత 8 మాసాలుగా అమోఘమైన రైతు ఉద్యమం సాగుతుందని ఆర్.నారాయణమూర్తి(R.Narayana Murthy) అన్నారు. దిల్లీ సరిహద్దుల్లో ఇంకా రైతుల ఉద్యమం చల్లారలేదని తేల్చి చెప్పారు. సాగు చట్టాలు వరాలు అంటూ తీసుకొచ్చిన కేంద్రం... మా పాలిట శాపాలు రద్దు చేయాలని రైతులు కోరుతుంటుంటే మొండివైఖరి అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. కీలక వ్యవసాయ రంగం, రైతాంగం విశాల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కారు తక్షణమే సాగు చట్టాలు రద్దు చేయాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవడంతోపాటు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.