బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 'మదర్ ఆఫ్ డ్యాన్స్'గా పేరుగాంచిన ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ కన్నుమూశారు. గుండెపోటుతో ముంబయిలోని గురునానక్ ఆసుపత్రిలో అర్ధరాత్రి చనిపోయారు. ఆమె వయసు 71 సంవత్సరాలు. శ్వాసకోశ సమస్యలు రావడం వల్ల గత నెలలో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. శ్వాస సమస్యల నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది.
పరిచయం
సరోజ్‌ఖాన్ అసలు పేరు నిర్మలా నాగ్‌పాల్. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 2 వేలకుపైగా పాటలకు కొరియోగ్రాఫర్‌గా ఆమె పని చేశారు. 1974లో గీతా మేరా నామ్ చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన సరోజ్..'మిస్టర్ ఇండియా', 'నాగినా', 'చాంద్‌నీ' చిత్రాలకు నృత్య రీతులు సమకూర్చారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌కు మంచి పేరు తీసుకువచ్చిన 'తేజాబ్' చిత్రంలోని 'ఏక్ దో తీన్', 'దేవదాస్' చిత్రంలోని 'దోలారే.. దోలారే' పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. భర్త సోహన్‌లాల్ వద్దే ఆమె నృత్యం నేర్చుకున్నారు. సరోజ్‌ఖాన్ చివరి సారిగా 2019లో వచ్చిన 'కళంక్' చిత్రానికి కొరియోగ్రఫీ చేశారు.
మూడుసార్లు జాతీయ అవార్డులు
స్టార్ వన్ టీవీ ఛానల్‌లో వచ్చిన డ్యాన్స్ రియాల్టీ షో 'నాచ్ బాలియే' సహా అనేక టీవీ ఛానల్ కార్యక్రమాల్లోనూ ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. రిషిహుడ్ విశ్వవిద్యాలయానికి సలహాదారుగానూ పని చేశారు. బాలీవుడ్‌లో విజయవంతమైన కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సరోజ్‌ఖాన్‌కు మూడు సార్లు జాతీయ అవార్డు దక్కింది. సరోజ్‌ఖాన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కరోనా విస్తృతి నేపథ్యంలో ముంబయిలోని మలద్ స్మశానవాటికలో ఈ ఉదయం ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు