బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య వెనక నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టు బుధవారం తెలిపింది. ఎంతో ప్రతిభావంతుడైన, అద్భుతమైన నటుడ్ని ఇండస్ట్రీ కోల్పోయిందని పేర్కొంది. బిహార్ ప్రభుత్వ సిఫార్సు మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్రం.. సుప్రీంకోర్టుకు సమాచారమిచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దీనితో పాటు పట్నాలో తనపై వేసిన పిటిషన్ను ముంబయికి మార్చాలని కోరిన రియా విజ్ఞప్తిని పరిశీలించింది. ఈ క్రమంలోనే అత్యున్నత న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాలతో సహా, రాజ్పుత్ తండ్రి కృష్ణ కిశోర్ సింగ్.. ఈ విషయంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు
విచారణలో భాగంగా రాజ్పుత్ తండ్రి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. కేసును సుప్రీం కోర్టు పరిశీలిస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. అయితే చక్రవర్తికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని కోరారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు సాక్ష్యాలు లేకుండా చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజకీయంగా మార్చేశారు
సుశాంత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం పట్నా పోలీసులకు లేదని మహారాష్ట్ర తరఫున న్యాయవాది ఆర్.బసంత్ ధర్మాసనానికి తెలియజేశారు. విషయాన్ని రాజకీయంగా మార్చారని ఆరోపించారు. తాము ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నామని.. ముంబయి పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
అయితే, పిటిషన్ పెండింగ్లో ఉన్నంతవరకు రియాపై బలవంతపు చర్యలేవీ తీసుకోకూడదని ఆమె తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ కోర్టును కోరారు. ఈ వాదనలన్నీ విన్న ధర్మాసనం.. ఏం జరిగినా చట్టప్రకారం జరిగేలా చూడాలని తెలిపింది.
అది మంచి సంకేతం కాదు..
సుశాంత్ కేసు సమాచారం కోసం ముంబయికి వెళ్లిన బిహార్ పోలీసు అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచడాన్ని జస్టిస్ రాయ్ తప్పుబడ్డారు. ఇటువంటి చర్యలు మంచి సంకేతం కాదని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని పద్దతి ప్రకారం చేయాలని.. సాక్ష్యాలకు భద్రత కల్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ధర్మాసనం.