బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణంపై ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. సుశాంత్ ప్రేయసి రియాకు డ్రగ్స్ వ్యాపారులతో సంబంధం ఉన్న విషయమై మూడో రోజూ విచారణ కోసం ఆమెను పిలిపించారు ఎన్‌సీబీ అధికారులు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5గంటలకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
సుశాంత్‌కు చెందిన సినిమా సెట్‌లో డ్రగ్స్ వినియోగించినట్లు రియా చెప్పగా.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా సమన్లు పంపాలని ఎన్‌సీబీ యోచిస్తోంది. ఈ కేసులో నిందితులు ఇచ్చిన పేర్ల ఆధారంగా ఇప్పటికే 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల జాబితాను అధికారులు తయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇపుడు సినీ పరిశ్రమలో ఈ అరెస్టు కల్లోలం సృష్టిస్తోంది. ఎపుడు ఎవర్ని ఎన్‌సీబీ విచారణకు పిలుస్తుందో అంటూ బిక్కుబిక్కుమంటున్నారు డ్రగ్స్ బాధితులు.
సోమవారమే రియాను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగ్గా.. అదేమీ జరగలేదు. ఆమె విచారణకు సహకరిస్తున్నారని పేర్కొన్న ఎన్‌సీబీ అధికారులు.. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీచేశారు. మూడో రోజు విచారణలో భాగంగా తాను గంజాయి మాత్రమే కాకుండా ఇతర కెమికల్స్ వాడినట్లు రియా చెప్పారని సమాచారం.
సుశాంత్ మరణంపై నమోదైన కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు 28 ఏళ్ల రియాను విచారించిన సందర్భంలో ఆమె వాట్సాప్ చాట్‌ను పరిశీలించారు. అందులో డ్రగ్స్‌కు సంబంధించిన సంభాషణ ఉండటం వల్ల ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించింది. తానేం చేసినా సుశాంత్ కోసమే చేశానని ఆమె సోమవారం ఎన్‌సీబీ అధికారుల వద్ద అన్నట్టు సమాచారం
.