బాలీవుడ్లో కొత్తవారిని పరిచయం చేస్తూ సల్మాన్ ఖాన్ తెరకెక్కిస్తున్న సినిమా "నోట్బుక్". అతడు ఈ చిత్రంలో ఓ పాట పాడనున్నాడు. తొలుత అతిఫ్ అస్లమ్చే పాడించాలనుకున్నా.. పాకిస్థానీ గాయకుడు కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకుంది చిత్రయూనిట్. గత నెలలో పుల్వామాలో పాక్కు చెందిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడి అనంతరం ఆ దేశానికి చెందిన నటీనటులు, గాయకులపై నిషేధం విధించారు.
"మై హూం హీరో తెరే" అంటూ సాగే ఈ పాటను దుబయిలో రికార్డింగ్ చేయనున్నారు.
హీరోగా నటిస్తున్న జహీర్ ఇక్బాల్ ఎటువంటి సినీ నేపథ్యం లేకుండానే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అలనాటి నటి నూతన్ మనవరాలు ప్రనూతన్ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతోంది.
జాతీయ అవార్డు గెలుచుకున్న నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 29న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోందీ చిత్రం.