సినిమాల్లోనే కాదు.. పనిలోనూ, ప్రవర్తనలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించే దర్శకుడు రవిబాబు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమా 'క్రష్'. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లకు అనుమతి రావడం వల్ల చిత్రీకరణ ప్రారంభించారు. ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత ప్రారంభమైన తొలి సినిమా షూట్ ఇదేనని ఈ సందర్భంగా రవిబాబు చెప్పారు. ఈ క్రమంలోనే సెట్‌లో వీడియో విడుదల చేశారు. ఇందులో హీరో హీరోయిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని తెరకెక్కించామని చెప్పారు.
"హీరో ఈ వైపు నుంచి పరిగెత్తుకుని వస్తాడు.. హీరోయిన్ మరోవైపు నుంచి పరిగెత్తుకుని వస్తుంది. ఇద్దరు గట్టిగా హగ్ చేసుకుంటారు" అంటూ రవిబాబు మధ్యలో గాజు గోడను పెట్టారు. రొమాంటిక్ సన్నివేశంలోనూ భౌతిక దూరాన్ని పాటిస్తున్నామని ఆ సన్నివేశం ద్వారా ఆయన స్పష్టం చేశారు.
రవిబాబు గతేడాది 'అదుగో', 'ఆవిరి' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాల్లోనూ ఆయన ప్రధాన పాత్ర పోషించారు. దర్శకత్వం కూడా వహించారు.