తక్కువ కాలంలోనే అగ్రకథానాయికల జాబితాలో చేరిన అందాల నాయిక రష్మిక మందన. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలోనూ నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను', అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ అందాల భామ అభిమానులను, అనుచరులను ఉద్దేశించి విలువైన ఆణిముత్యాల్లాంటి మాటలను పంచుకుంది.
"నా స్నేహితుడు నాకొకటి చెప్పారు. అది మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. మీకు నచ్చిన అంశంపై సమయాన్ని వెచ్చించండి. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అది మీకు చిరునవ్వు, సంతోషం.. ఇంకా ఆనందాన్ని ఇస్తుంది" అని పేర్కొంది.
ప్రస్తుతం కరోనా రెండో దశలో తన వంతుగా ఇతరులకు మాట సాయం చేయడానికి #SpreadingHopeను ప్రారంభించింది రష్మిక. ఇతరులకు అవసరమైన సందేశాన్ని పంచుకొని ఆశావహ రీతిలో సహాయపడమనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. రష్మిక గతేడాది తెలుగులో 'సరిలేరు నీకేవరు', 'భీష్మ' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఆమె 'పుష్ప'లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి.