ఈ ఏడాదిలోనే తన కుమారుడు రానా దగ్గుబాటి వివాహం జరగబోతోందని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. రానా, మిహీకా బజాజ్ చాలా ఏళ్లుగా స్నేహితులని పేర్కొన్నారు.
"ఇటువంటి కష్ట సమయంలోనూ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాకు కారణం లభించింది. మొత్తం కుటుంబం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం నుంచి పిల్లలకు (రానా, మిహీక) పరిచయం ఉంది. వారి పట్ల మేం చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఏడాదిలోనే రానా వివాహం జరగబోతోంది. డిసెంబరులో పెళ్లి నిర్వహించాలని అనుకుంటున్నాం. కానీ దాని కన్నా ముందే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదిరిన తర్వాత మేమే వివరాలు వెల్లడిస్తాం. ఈ లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి పిల్లలు మాకు అవకాశం ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపై ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం."
-సురేశ్ బాబు, రానా తండ్రి
తన ప్రేమను మిహీకా బజాజ్ అంగీకరించిందని ప్రకటిస్తూ రానా మంగళవారం అందరికీ షాక్ ఇచ్చాడు. తన ప్రేయసి ఫొటోనూ పంచుకున్నాడు. ఈ సందర్భంగా ప్రముఖులంతా రానాకు శుభాకాంక్షలు చెప్పారు. మిహీక స్వస్థలం హైదరాబాద్. ఆమె 'డ్యూ డ్రాప్ స్టూడియో' అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతోంది. రానా, మిహీక కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తాజాగా వీరి బంధానికి పెద్దల ఆమోదం లభించిన కారణంగా పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.