"హాలీవుడ్‌లో పలు ఇండిపెండెంట్ సినిమాలకు స్క్రీన్‌ప్లే విభాగంలో పనిచేశా. నాగశౌర్యతో నాకు 'ఛలో' సమయంలో పరిచయం ఏర్పడింది. ఆయన ఈ కథ చెప్పగానే నచ్చింది. ఇలాంటి కథని ఎలా తీయొచ్చో తనతో నా ఆలోచనల్ని పంచుకున్నా. దాంతో ఈ సినిమా అవకాశమిచ్చారు. ఆయన ఎంత మంచి కథ రాశారో, ఆ కథలో అంతగా ఒదిగిపోయారు. ఇందులో ప్రతి సన్నివేశం అర్థవంతంగా ఉంటుంది."
"సమాజంలో మహిళల పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నామో చెప్పే కథ ఇది. డేవిడ్ ఫించర్ సినిమాల్లో లాజిక్స్ నాకు ఇష్టం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఇందులో స్క్రీన్‌ప్లే రాశా. నాతోపాటే అమెరికాలో చదువుకున్న మనోజ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. ఆయన పనితనం, శ్రీచరణ్ పాకాల పాటలు, జిబ్రాన్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం."
"మాది మదనపల్లి. మా నాన్నకి సినిమాలంటే ఇష్టం. ఇంజినీరింగ్ సమయంలో లఘు చిత్రం చేశా. అమెరికాలో ఎంబీఏ చేసేందుకు వెళ్లి, ఇంట్లోవాళ్లకి తెలియకుండానే స్క్రీన్‌ప్లే కోర్సు పూర్తి చేశా. అక్కడే పలు ఇండిపెండెంట్ చిత్రాలకి పనిచేశా. స్వతహాగా నాకు డ్రామాలంటే ఇష్టం. క్రిష్ నా అభిమాన దర్శకుడు. ఆయన చేసిన 'కృష్ణం వందే జగద్గురుమ్' తరహా సినిమా చేయాలని ఉంది."
ఇదీ చదవండి: ఏయన్నార్ పాటకు నాగచైతన్య స్టెప్పులు..!