సినీ పరిశ్రమలో పనిచేసే దర్శకుడికైనా.. నాయకానాయికలకైనా విజయ పరంపరే ప్రధానం. ఓ అనూహ్యమైన విజయంతో శిఖర స్థాయికి చేరుకున్నాక దాన్ని అలాగే నిలబెట్టుకోవడం కత్తి మీద సవాలే ఇక్కడ. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా సినీ కెరీర్ అక్కడి నుంచి క్రమంగా మసకబారుతూ ఉంటుంది. అందుకే దర్శకుడైనా, కథానాయకుడైనా ఓ విజయం ఖాతాలో పడ్డాక మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.
ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ ఇదే తరహాలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న ఈ యువ హీరో.. ఇప్పుడా విజయ పరంపరను అదే విధంగా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అందుకే తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయట్లేదు.
రామ్.. పూరీతో సినిమాను పట్టాలెక్కించడానికి ముందే కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొందరు నిర్మాతల దగ్గర నుంచి అడ్వాన్సులూ తీసుకున్నాడు. కానీ, 'ఇస్మార్ట్ శంకర్'తో వచ్చిన భారీ మాస్ ఇమేజ్ పుణ్యమాని ఇప్పుడా కథలన్నీ పక్కకు పెట్టేశాడట రామ్. 'ఇస్మార్ట్' తర్వాత తన మార్కెట్, ప్రేక్షకుల్లో క్రేజ్ అమాంతం పెరిగిన నేపథ్యంలో దాన్ని నిలబెట్టుకునే దిశగా ఓ సరైన కథను ఎంపిక చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడట.
"ఇస్మార్ట్‌ను మించిన కథలుంటే పట్టుకు రండి" అని తన వద్దకు వస్తున్న దర్శక,నిర్మాతలకు చెప్పేస్తున్నాడట ఎనర్జిటిక్ స్టార్. అంతేకాదు సరైన కథ దొరికే వరకు ఎన్ని నెలల సమయమైనా ఖాళీగా ఉండేందుకు సిద్ధపడుతున్నాడట. మరి రామ్‌ను మెప్పించే కథను ఏ దర్శకుడు సిద్ధం చేస్తాడో వేచి చూడాలి.
ఇవీ చూడండి.. ఒత్తిడి తట్టుకోలేక నటి ఆత్మహత్య..