రామ్‌చరణ్ ఓవైపు కథానాయకుడిగా బిజీగా గడిపేస్తూనే.. తన తండ్రి కోసం నిర్మాతగానూ పనిచేస్తున్నాడు. చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి అతడి కోసం కథలు సిద్ధం చేయించడం.. ఆ కథలకు తగ్గ దర్శకుల్ని వెతికి పట్టుకురావడం అన్నీ చెర్రీనే చూసుకుంటున్నాడు. ప్రస్తుతం చరణ్ నిర్మాణంలోనే కొరటాల శివ - మెగాస్టార్ కొత్త చిత్రం ముస్తాబవుతోంది. ఇది పూర్తయిన వెంటనే తన తండ్రి కోసం చరణ్ ఇప్పటికే ఓ కథ కూడా వెతికి పెట్టేసుకున్నారు. అదే 'లూసిఫర్' రీమేక్. అయితే ఇటీవలే రామ్‌చరణ్ 'డ్రైవింగ్ లైసెన్స్' అనే మరో మలయాళ చిత్ర రీమేక్ హక్కులు కొన్నట్లు వార్తలొచ్చాయి.
ఈ సినిమా తన బ్యానర్‌లోనే బయట హీరోతో నిర్మించనున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ, తాజాగా చరణ్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. అతడు 'డ్రైవింగ్ లైసెన్స్' హక్కులు కొనలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం చరణ్ నటుడిగా 'ఆర్‌ఆర్‌ఆర్'తో.. నిర్మాతగా చిరంజీవి 152వ సినిమాతో తీరిక లేకుండా ఉన్నాడు. ఈ రెండింటిపైనే చెర్రీ దృష్టంతా ఉందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పుడా చిత్ర రీమేక్ హక్కులను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.