పాకిస్థాన్‌లోని సొంతింటిని చూడాలన్న తన తాతయ్య కోరికను నెరవేర్చలేకపోయామని హీరోయిన్ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ వాపోయింది. ఆమె నటించిన 'సర్దార్ కా గ్రాండ్ సన్' ఓటీటీలో విడుదలైంది. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్‌సింగ్, నీనా గుప్తా నటించారు.
అయితే.. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం ఒక ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణాలతో పాటు తమ కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికరమై విషయాలు పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే..
"మా ఇద్దరు తాతయ్యలు పాకిస్థాన్ నుంచి వచ్చారు. వాళ్లు ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను వాళ్లు చెప్పిన కథలు వింటూ పెరిగాను. ఇక్కడికి రావడం కోసం వాళ్లు ఉన్నదంతా వదులుకున్నారు. అప్పట్లో వాళ్లు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. 'సర్దార్ కా గ్రాండ్ సన్' కథ నా మనసుకు తాకింది. ఎందుకంటే.. మా తాతయ్య పాకిస్థాన్‌లోని తన ఇంటికి వెళ్లిరావాలని మా నాన్నతో అంటుండేవారు. అయితే.. భారత ఆర్మీలో అధికారిగా సేవలందిస్తున్న మా నాన్నకు అది సాధ్యం కాలేదు. మా నాన్న పదవీ విరమణ పొందే సమయానికి మా తాతయ్య వయసుపై బడింది. అందుకే ఇప్పుడు అంతదూరం ప్రయాణించడం కష్టంగా మారింది. అయితే.. ఆయన మాకు చెప్పిన కథల వల్లే ఈ సినిమాకు నేను ఒప్పుకొన్నాను."
- రకుల్‌ప్రీత్ సింగ్, కథానాయిక
"ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఈ సినిమా పెద్ద తెరపై ఆడాలనే కోరుకున్నాం. ఇప్పుడు పరిస్థితులు బాగా లేవన్న విషయం మనందరికీ తెలుసు. అయితే.. నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకులను చేరుకోవచ్చు. ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉంటున్నాం.. కుటుంబాలకు దగ్గరయ్యాం. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ముఖం మీద చిన్న చిరునవ్వు తెప్పించగలిగినా మా సినిమా విజయం సాధించినట్లే" అని రకుల్ పేర్కొంది.
ఇదీ చూడండి.. హాస్యనటి శ్యామలకు మెగాస్టార్ సాయం