కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్న స్టార్ రజనీకాంత్. తమిళనాడులో ఆయన్ను దేవుడిగా భావించి పూజించేవారు ఎందరో. ఇంతకీ ఆయనకెందుకు ఇంత క్రేజ్ వచ్చిందో మీరెప్పుడైనా ఆలోచించారా?. కేవలం ప్రతిభ ఉన్నంత మాత్రానా సినీ పరిశ్రమలో క్లిక్ కాలేరు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయాలు స్టార్స్ వ్యక్తిగత జీవితంలోనూ ఉండాలి. అప్పుడే వారిపై మరింత అభిమానం పెరుగుతుంది. నటన నచ్చితే కళ్లకు నచ్చుతారు.. వ్యక్తిత్వం నచ్చితే మనసుకు చేరువైపోతారు కదా. అలాంటి అంశాలు రజనీలో చాలా ఉన్నాయి. సూపర్‌స్టార్ అయినప్పటికీ ఆడంబరాలకు దూరంగా ఉంటూ, మానవత్వంతో వ్యవహరించడం అందర్నీ మెప్పించింది. డిసెంబరు 12 (శనివారం)ఆయన జన్మదినం సందర్భంగా నటన కాకుండా రజనీలోని ప్రత్యేక అంశాల్ని ఓ సారి తెలుసుకుందాం.
భక్తి
రజనీకి దైవభక్తి ఎక్కువ. మనసును ప్రశాంతంగా, ఏకాగ్రతగా ఉంచుకోవడానికి ఆయన హిమాలయాలకు వెళ్లి, అక్కడి గుహల్లో కొన్ని రోజుల పాటు తపస్సు చేస్తుంటారు. 'ప్రతి సినిమా తర్వాత నేను హిమాలయాలకు వెళ్తుంటా. ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్తుంటా. అక్కడి గ్రామాల్లోని ప్రజల ఇళ్లకి వెళ్లి వస్తుంటా' అని ఓసారి తలైవా చెప్పారు.
తిరిగిచ్చేస్తారు
రజనీ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆడకపోతే ఆయన పంపిణీదారులకు డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తుంటారు. తన సొంత డబ్బుల్ని వారికి ఇవ్వడం విశేషం. పరాజయాన్ని స్వీకరించి.. నష్టం ఆయనే భరిస్తారు. స్వార్థంలేని ఆయన మనసును అందరూ ఇష్టపడతారు. బాబా సినిమా వల్ల పంపిణీదారులు తీవ్రంగా నష్టపోయినప్పుడు రజనీ వారిని ఆదుకున్నారు.
విరాళాలు
అవసరాల్లో ఉన్న చాలా మందికి సహాయం చేసి అభిమానుల హృదయాలకు మరింత దగ్గరయ్యారు రజనీ. పలువురి విద్యా, వైద్య ఖర్చుల్ని ఆయనే భరించారు. అయితే ఇలాంటి విషయాల్ని ప్రచారం చేసుకోవడానికి రజనీ ఇష్టపడరు. కానీ, ఇటీవల ఆయన సాయం పొందిన ఓ యువకుడు మీడియాతో మాట్లాడారు. ‘మా అమ్మ రజనీ సర్ ఇంట్లో పనిచేసేది. నా ఫీజులన్నీ ఆయనే కట్టారు. ఇప్పుడు ఆయన ఫ్యాన్ క్లబ్స్ ద్వారా పోస్టర్లు డిజైన్ చేస్తూ రుణం తీర్చుకుంటున్నా' అని అన్నారు. ఇటీవల చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు రజనీ తన పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేశారు. అంతేకాదు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఇబ్బందిపెట్టరు
ఏ కార్యక్రమమైనా, షూటింగ్ అయినా రజనీ సరైన సమయానికి స్పాట్‌లో ఉంటారు. ఇతరులు తన కోసం ఎదురుచూడటం ఆయనకు నచ్చదు. తామేంటో చూపించుకోవాలనే ఉద్దేశంతో కొందరు నటులు ఆలస్యంగా వస్తారు. అలాంటి రజనీ సినీ కెరీర్‌లో లేదని కోలీవుడ్ జనాలు అంటుంటారు.
డ్రైవింగ్ కూడా..
అందరి స్టార్స్‌లా రజనీ కాదు. తన వెంట ఎక్కువ మంది రావడాన్ని ఆయన ఇష్టపడరు. షూటింగ్ అయినా, ఈవెంట్ అయినా ఆడంబరం లేకుండా వస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా తన కారుకు తానే డ్రైవింగ్ చేయడానికి ప్రాముఖ్యం ఇస్తుంటారు.
అన్నీ భద్రంగా..
రజనీకి ఏ వస్తువునైనా కొనే సత్తా ఉంది. కానీ ఆయన తన పాత వస్తువుల్ని, దుస్తుల్ని, కారుల్ని భద్రంగా దాచుకుంటారు. వస్తువుల విలువ తెలుసు కాబట్టే ఆయన వాటిని దూరం చేసుకోవడానికి ఇష్టపడరు.
ఇప్పటికీ..
రజనీకి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు కె. బాలచందర్. ఆయనతో బంధాన్ని రజనీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆయన్నే మార్గదర్శకంగా భావిస్తుంటారు. వచ్చిన దారిని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. అంతేకాదు హీరోగా తన తొలి సినిమా భైరవిని నిర్మించిన కలైజ్ఞానంకు రూ.కోటి విలువజేసే ఇల్లు కొనిచ్చారు. గృహ ప్రవేశానికి కూడా వెళ్లొచ్చారు.
ప్రమాదాల నివారణకు..
దాదాపు 28 ఏళ్ల క్రితం ముగ్గురు రజనీ అభిమానులు ప్రమాదంలో మృతి చెందారు. చెన్నైలో నిర్వహించిన తలైవా పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రజనీని తీవ్రంగా కలచివేసింది. ఇలాంటివి జరగకూడదని ఆయన అప్పటి నుంచి చెన్నైలో వేడుకల్ని జరుపుకోవడం ఆపేశారు.
అందరూ సమానం
తలైవా అందర్నీ ఒకే విధంగా గౌరవిస్తారు. సెట్‌లోని ప్రతి ఒక్కరితోనూ ఒకే విధంగా ప్రవర్తిస్తారు. 'ఆయన షూటింగ్ స్పాట్‌లోని ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రాముఖ్యం ఇస్తారు. అది లైట్ బాయ్ కావొచ్చు, సహ నటుడు కావొచ్చు.. ఆయన స్థాయిని బట్టి ఎవర్నీ చూడరు' అని ఓసారి రజనీ సహ నటి విజ్జి చంద్రశేఖర్ మెచ్చుకున్నారు.
సింప్లిసిటీ
రజనీ ఎప్పుడూ తెల్ల పంచెతోనే కనిపిస్తుంటారు. ముఖానికి కూడా ఎటువంటి మేకప్ ఉండదు. ఓ సాధారణ వ్యక్తిలా ప్రజల ముందుకొచ్చి, పలకరిస్తుంటారు. ఆయనలోని ఈ గుణం కూడా మరింతమందిని అభిమానులుగా చేసింది.
రియల్ స్టోరీ
ఎన్నో కథల్లో రజనీ కుటుంబం కోసం కష్టాలుపడటం చూసుంటాం. కానీ, నిజ జీవితంలోనూ ఆయన సమస్యలు ఎదుర్కొన్నారు. ఆయన బాల్యంలోనే తండ్రి మరణించారు. దీంతో కుటుంబానికి అండగా ఉండేందుకు కూలి పని కూడా చేశారు. పట్టుదల, శ్రమతో ఇప్పుడు ఆ స్థాయి నుంచి అగ్ర కథానాయకుడిగా ఎదిగారు.
ఆసక్తి
రజనీకి పుస్తక పఠనంపై ఆసక్తి ఉందన్న విషయం చాలా మంది అభిమానులకు తెలియదు. ఆయన సమయం ఉన్నప్పుడల్లా పుస్తకాలు చదువుతుంటారు. సైన్స్, రాజకీయాలు, దైవభక్తి అంశాలంటే ఆయనకు ఆసక్తి ఎక్కువ. వీటిపై ఆయనకు మంచి పట్టు ఉంది.
ఆరోగ్య రహస్యం ఇదే!
70ఏళ్ల వయసులోనూ రజనీ ఆరోగ్యంగా ఉండటానికి కారణాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన 'దర్బార్' ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయాన్ని చెప్పారు. "70 ఏళ్లు వచ్చాయి నాకు. ఇంకా హీరోగా నటిస్తున్నానంటే కారణం ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహం. అదే నాకు శక్తినిస్తోంది. ఇంత ఉత్సాహంగా, సంతోషంగా ఎలా ఉంటారని అడుగుతుంటారు. తక్కువగా ఆశపడండి, తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి, తక్కువగా వ్యాయామం చేయండి, తక్కువగా మాట్లాడండని చెబుతుంటా. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం' అని చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి : సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా?