కరోనా వైరస్ మూడో దశ ఎంత ఉద్ధృతంగా ఉన్న పిల్లలను రక్షించుకోగలమనే నమ్మకం తల్లిదండ్రుల్లో ఉండాలని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (s.s rajamouli) సూచించారు. ఇటీవల ఐసీఎంఆర్ ప్రకటించిన అంశాల ప్రకారం మూడో దశలో పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొన్న ఆయన.. గతంలో కంటే ఈసారి ఎక్కువ శాతం కేసులు నమోదైనప్పటికీ దేశ జనాభాతో పోల్చితే చాలా తక్కువన్నారు.
మూడో దశలో ఎవరికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది, ఎలా అప్రమత్తమవ్వాలనే అంశాలపై లిటిల్ స్టార్ హెల్త్ కేర్ వైద్యులు డాక్టర్ జి.సతీష్‌తో వర్చువల్ పద్ధతిలో రాజమౌళి ప్రత్యేకంగా చర్చించారు. ఆన్లైన్ వేదికగా ప్రజలు వ్యక్తం చేసిన సందేహాలను డా.సతీష్ దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేశారు. అయితే కొవిడ్ బారినపడ్డామని ఆందోళన చెందవద్దని.. కొవిడ్ నుంచి కోలుకున్నామని అజాగ్రత్తగా ఉండకూడదని జక్కన్న విజ్ఞప్తి చేశారు. నిర్ధరణ పరీక్షల ప్రాధాన్యత కంటే సత్వరమే కరోనా లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించాలని సూచించారు.